TS Budjet: మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ మధ్యంతర బడ్జెట్..

TS Budjet: మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ మధ్యంతర బడ్జెట్..
ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క అసెంబ్లీలో,శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో

2024-25 ఆర్థిక సంవత్సరం కోసం తెలంగాణ మధ్యంతర బడ్జెట్‌ నేడు ఉభయ సభల ముందుకు రానుంది. తెలంగాణ ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో,శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మండలిలో కొత్త పద్దును ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

లేని గొప్పలు వద్దని,వాస్తవాలకుఅనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే అధికారులకు స్పష్టంచేశారు. ఆ ప్రకారమే 2024-25 బడ్జెట్ ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో న్నుల ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కొన్ని విభాగాల్లో అంచనాలకు దూరంగానే ఉన్న పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి వస్తాయన్న ఆశతో భారీగా అంచనా వేసిన గ్రాంట్లు స్వల్పంగానే అందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 2 లక్షలా 90 వేల కోట్లు కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2 లక్షల 90 వేల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉండే అవకాశముంది. లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ తొలి బడ్జెట్ ప్రజాకర్షకంగానే ఉండే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీలకుప్రాధాన్యం దక్కనుంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసిన సర్కార్..మరో రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేయనుంది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని తెలిపింది. గ్యారంటీల అమలుకు ఏటా 60 వేల కోట్లు అవసరమని అంచనా వేసినట్లు చెప్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలకు కూడా కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి సంబంధించి బడ్జెట్‌లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌లో అందుకు తగ్గట్లుగా ప్రతిపాదనలు చేయనుంది. చాలా శాఖలకు సంబంధించిన ప్రగతి పద్దులో కోత పడినట్లు సమాచారం. ఆర్థికపరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పలు శాఖలకు ప్రస్తుత కేటాయింపుల కంటే తక్కువగానే ప్రతిపాదించినట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల తర్వాత.. పూర్తి స్థాయి బడ్జెట్ సమయంలో అన్ని అంశాలను మరింత సమగ్రంగా బేరీజు వేసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story