DRUGS CASE: డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

DRUGS CASE: డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ముమ్మరం
లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు... డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న వారి గుండెల్లో రైళ్లు...

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే వెలుగుచూసిన నిజాలు సంచలనం రేపుతుండగా మరింత లోతుగా దర్యాప్తు చేసి ఈ డ్రగ్స్‌ కేసులో మూలాలను ఛేదించాలని పోలీసులు చూస్తున్నారు. రేవ్‌ పార్టీలు, వారాంతాల్లో పబ్‌లకు వెళ్లే వ్యాపార, రాజకీయ, సీనీ వర్గాల్లోని పలువురికి ఈ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ డ్రగ్స్‌ కేసులో నిందితుల ఫోన్లకు వచ్చిన కాల్స్‌ గురించి దర్యాప్తు అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. నిందితుల సెల్‌ఫోన్లకు మాదకద్రవ్యాల కొనుగోలుదార్లు ఫోన్‌లు చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తుతో ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న వారి గుండెల్లో రైల్లో పరిగెడుతున్నాయి. ఎప్పుడు తమను పోలీసులు విచారణకు పిలుస్తారోనని సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా భయాందోళనలకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ఆగంతకులు ఇదే అదునుగా మత్తు వాడకందార్లను బెదిరించి వసూళ్ల పర్వానికి దిగుతున్నారు.


సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో మత్తు పదార్థాల కేసుల్లో పట్టుబడుతున్న వారు అధిక శాతం సినీ పరిశ్రమకు చెందిన వారేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇటీవల అరెస్టయిన సినీ నిర్మాత కేపీ చౌదరి, ఫైనాన్షియర్‌ వెంకటరత్నంరెడ్డి, రాంచంద్‌తో కలిసి నటుడు నవదీప్‌ సంబంధాలు గుర్తించిన నార్కోటిక్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నవదీప్‌ను ప్రశ్నించిన పోలీసులు.. ఈవెంట్‌ మేనేజర్‌ కలహర్‌రెడ్డి, సూర్య, సినీ నిర్మాత ఉప్పలపాటి రవిని కూడా ఇవాళ విచారించనున్నారు. గతంలో మాదకద్రవ్యాల రవాణా చేసే వారి పై మాత్రమే కేసులు నమోదు చేసేవారు. వినియోగదారులు పట్టుబడితే కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేసేవారు. ప్రస్తుతం వినియోగదారులను కూడా నిందితుల జాబితాలో పోలీసులు చేర్చుతున్నారు.

ఇప్పటికే అరెస్ట్‌ చేసిన గోవా డ్రగ్స్‌ కీలక సూత్రదారి ఎడ్విన్‌ వద్ద కొకైన్‌, LSD బ్లాట్స్‌, MDAA కొనుగోలు చేసిన 175 మందిపైన కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి డ్రగ్స్‌ అమ్మే వాళ్ల వద్ద లభించే సమాచారంతో వినియోగదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు కానిస్టేబుళ్లు నిందితుల ఫోన్లలో లభించిన స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి పది నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసినట్టు.. ఆరోపణలొచ్చాయి. మరోసారి కొందరు ఇదే తరహాలో ఫోన్లు చేసి వసూళ్ల పర్వానికి దిగుతుండడంతో పోలీసులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. వసూళ్లు చేస్తుంది ఎవరనే విషయం పై లోతుగా విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story