నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ పోస్టుపై ఉత్కంఠ!

నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ పోస్టుపై ఉత్కంఠ!

తెలంగాణలో కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి మొదలైంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామాతో పీసీసీ చీఫ్‌ పోస్టు ఖాళీ అయింది. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక పొంచి ఉన్న అత్యంత కీలక సమయంలో.. పీసీసీ పీఠం ఖాళీ కావడంతో...ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరా అన్న ఆసక్తి మొదలైంది. వాస్తవానికి పీసీసీ చీఫ్‌ మార్పు విషయంలో గత కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత... చీఫ్‌ను మార్చాలన్న వాదనకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలో పీసీసీ టాప్‌ పోస్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో దూకుడుగా వ్యవహరించే రేవంత్‌ రెడ్డి పేరే పీసీసీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బీసీ నాయకులు సైతం ఈ సారి పీసీసీ పీఠంపై గురిపెట్టారు. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి కాకుండా... ఈ సారి తమకే అవకాశం ఇవ్వాలని బీసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వారంతా ఇటీవలే విడిగా సమావేశం కూడా అయ్యారు.

మరోవైపు ప్రస్తుతమున్న నేతల్లో తానే సీనియర్‌ను అని.. అందువల్ల తనకే పీసీసీ పీఠం కట్టబెట్టాలని కోమటి రెడ్డి గట్టిగానే డిమాండ్‌ చేస్తున్నారు. అటు శ్రీధర్‌బాబుకు సౌమ్యుడిగా ముందు నుంచి అధిష్టానం దగ్గర మంచి పేరు ఉంది. అయితే కాంగ్రెస్‌ అధిష్టానం వ్యవహారం చూస్తుంటే.. ఇప్పుడప్పుడే పీసీసీ చీఫ్‌ ఎంపిక ఉంటుందా అన్నది అనుమానంగానే మారింది. సోనియాగాంధీ కేవలం ఇంఛార్జిగా మాత్రమే ఉండి AICC వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. కమిటీకి దిశానిర్దేశం చేయగల అహ్మద్‌ పటేల్‌ కన్నుమూయడం.. రాహుల్‌ గాంధీ అంటీ ముట్టనట్లుగా వ్యవహరించడం.. ఇతర సీనియర్‌ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉండడంతో.. పార్టీ పరిస్థితి జాతీయ స్థాయిలోనే అయోమయంగా ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాకే.. తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్‌ను నియమిస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

అయితే కార్యకర్తల్లో మాత్రం పీసీసీ చీఫ్‌ వ్యవహారం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ పార్టీకి.. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక రూపంలో మరో సవాల్‌ పొంచి ఉంది. ఈ పరిస్థితుల్లో తక్షణమే అప్రమత్తమై.. వ్యూహాలు సిద్ధం చేస్తే తప్ప.. సాగర్‌లో గెలిచే పరిస్థితి లేదని.. క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. అలా జరగాలంటే వీలైనంత త్వరగా పీసీసీ చీఫ్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుందని.. అధిష్టానం ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story