తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త రథసారధిని నియమించే పనిలో అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త రథసారధిని నియమించే పనిలో అధిష్టానం

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త రథసారధిని నియమించే పనిపై దృష్టి పెట్టింది అధిష్టానం. రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయాలని ఏఐసీసీ ఇంచార్జ్‌కి పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్ ఠాగూర్ ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు కోర్ కమిటీ సమావేశం జరగనుంది. పీసీపీ చీఫ్ కోసం రెండు రోజులపాటు అభిప్రాయసేకరణ చేయనున్నారు ఠాగూర్. రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశమవుతారు. నేతల నుంచి తీసుకున్న అభిప్రాయాలను నివేదికలో పొందుపరిచి సోనియా, రాహుల్ గాంధీకి స్వయంగా ఇవ్వనున్నారు ఠాగూర్. కొత్త పీసీసీ చీఫ్‌పై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ బాగానే ఉంది. రేస్‌లో ఉన్నానంటూ కొందరు.. తానూ అర్హుడినేనంటూ మరికొందరు పీసీసీపై స్టేట్‌మెంట్లు ఇస్తూ వస్తున్నారు. రేసులో తాను కూడా ఉన్నట్లు ఈమధ్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే, కోమటిరెడ్డి కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. పార్టీ సీనియర్‌గా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు రేవంత్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో రేవంత్ టచ్‌లో ఉన్నారు. ఇక సామాజికవర్గం కోణంలో శ్రీధర్‌బాబు పేరు కూడా వినిపిస్తోంది. రేసులో మధుయాష్కీ కూడా ఉన్నారు.

ఏదేమైనా.. ఎలాంటి వివాదాలు రాకుండా మెజారిటీ నేతల అభిప్రాయానికి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త కెప్టెన్ ఎవరు, అధిష్టానం ఎవరికి అవకాశం ఇవ్వనుందనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.



Tags

Read MoreRead Less
Next Story