TPCC: నేడే కాంగ్రెస్‌ మూడో విడత జాబితా

TPCC: నేడే కాంగ్రెస్‌ మూడో విడత జాబితా
వామపక్షాల సీట్ల కేటాయింపుతో ఉత్కంఠ.... ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆశావహులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాల అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం తర్జనభర్జనలు పడుతోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో ఉంచుకుని మూడో జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల తర్వాత ఉత్పన్నమైన పరిణామాల దృష్ట్యా మూడో జాబితాపై కసరత్తు మరింత పారదర్శకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా 55మంది పేర్లతో అధిష్టానం విడుదల చేసినప్పటికీ పెద్దగా అసంతృప్తి వ్యక్తం కాలేదు.


రెండో జాబితా 45మంది పేర్లతో విడుదల చేసిన తర్వాత పార్టీని కుదిపేసే స్థాయిలో అసమ్మతి చెలరేగింది. దీంతో రాజీనామాల పర్వంతోపాటు అసమ్మతి గళం వినిపించిన నాయకుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు అసంతృప్తులు ఉండడంతో వారిని బుజ్జగించడం పార్టీకి కత్తిమీద సాములా మారింది. నష్ట నివారణ చర్యలు చేపట్టిన కాంగ్రెస్... వివిధ మార్గాల్లో అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో మూడో జాబితాపై కాంగ్రెస్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలలో ఎవరిని అభ్యర్థులుగా బరిలో దించాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండడంతో అభ్యర్థుల మూడో జాబితా ఇవాళ విడుదల అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


వామపక్షాలకు కాంగ్రెస్‌ ఇవ్వాల్సిన నాలుగు సీట్లు కూడా కేటాయించే పరిస్థితులు లేకుండా పోయాయని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెం, చెన్నూరు, మునుగోడు, వైరా స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ CPM మాత్రం తాము అడిగిన సీట్లనే ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటివరకు ప్రకటించిన వంద నియోజకవర్గాల్లో కేవలం 20 చోట్ల మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు. అత్యధికంగా రెడ్లకు 38 సీట్లు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు పోగా మిగిలిన వారిలో బీసీలకు కనీసం నాలుగు టికెట్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూడో జాబితాలో నిన్ను రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీ... చెన్నూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు. దీంతో చెన్నూరు టికెట్ కూడా వామపక్షాలకు దక్కకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది..

Tags

Read MoreRead Less
Next Story