TRS Party : రైతు దీక్షల విషయంలో తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్

TRS Party : రైతు దీక్షల విషయంలో తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్
TRS Party : రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ తో హైదరాబాద్ మినహా అంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

TRS Party : రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ తో హైదరాబాద్ మినహా అంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇక ఈనెల 29న వరంగల్ వేదికగా ద్విదశాబ్ది విజయ గర్జన సభ కూడా టీఆర్ఎస్ వాయిదా వేసుకుంది. అయితే కేంద్రం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నాలు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ ఉన్నా రైతు దీక్షల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది టీఆర్ఎస్.

తెలంగాణ రైతుల నుంచి వరి కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో... ఆందోళనలకు బ్రేక్ పడకుండా ఉండేందుకు కసరత్తులు చేస్తోంది అధికారపార్టీ. ఆయా జిల్లాల కలెక్టర్ల అనుమతి తీసుకుని ధర్నాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేంద్రం రైతు విధానాలకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు సక్సెస్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

వరి కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం వరి కొంటుందో లేదో తేల్చి చెప్పాలని టీఆర్ఎస్ పట్టు పడుతుంటే... బీజీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కేసీఆర్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వరి కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయడంతోపాటు అవసరమైతే ఢిల్లీకి సైతం వెళ్లి నిరసనలు తెలియజేస్తామని అన్నారు. అందుకే శుక్రవారం జరిగే ఆందోళనలను సక్సెస్ చేసి తమ వాదనను బలంగా వినిపించాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story