Top

GHMC : ఇతర పార్టీలకంటే పూర్తి దూకుడుగా టీఆర్‌ఎస్‌

GHMC : ఇతర పార్టీలకంటే పూర్తి దూకుడుగా టీఆర్‌ఎస్‌
X

గ్రేటర్‌ ఎన్నికలతో హైదరాబాద్‌ మహానగరం హోరెత్తుతోంది. పోటీ పోటీ ప్రచారాలు.. విమర్శలు-ప్రతి విమర్శలతో భాగ్యనగరం హాట్‌ హాట్‌గా మారింది. బల్దియా పోలింగ్‌కు మరో 9 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ మినాహా అన్ని ప్రధాన పార్టీలు శనివారం రాత్రి వరకు పూర్తిస్థాయిలో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోయాయి. అన్ని స్థానాలకు ఖరారు చేసినట్లు చెబుతున్నా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ ఇతర పార్టీ నేతలను స్వాగతిస్తూనే ఉంది. తాజాగా స్వామిగౌడ్‌ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆయనను కలిశారు.

ఇతర పార్టీలకంటే టీఆర్‌ఎస్‌ పూర్తి దూకుడుపై ఉంది. ఇప్పటికే ప్రచారాన్ని మంత్రి కేటీఆర్‌ పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి అమలుచేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే 150 డివిజన్లకు అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. తమకు అవకాశం ఇవ్వలేదన్న ఉద్దేశంతో కొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. వారిని బరి నుంచి తప్పించేందుకు కొంతమంది నాయకులను అధిష్ఠానం రంగంలోకి దింపింది. మొదట ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే 50కు పైగా డివిజన్లలో రెబల్స్‌ నామినేషన్లు వేయగా ఎమ్మెల్యేల సంప్రదింపులతో చాలా మంది ఉపసంహరించుకోవడానికి అంగీకరించినట్లు సమాచారం. అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తారన్న వ్యక్తులతో మాత్రం మంత్రులు కేటీఆర్‌, తలసాని మాట్లాడి బుజ్జగిస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికను బీజేపీ ఇంకా నూటికి నూరుశాతం పూర్తి చేయలేదు. శనివారం రాత్రికి దాదాపుగా జాబితాను ప్రకటించినా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇవాళ ఉదయానికి సిద్ధం చేసే పనిలో నాయకులున్నారు. బల్దియా పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరన్నది తెలియకపోవడంతో చాలా డివిజన్లలో ఇంకా ప్రచారం ఊపందుకోలేదు. TRS, కాంగ్రెస్‌లోని అసంతృప్తి వాదులను అగ్రనేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇవాళ కేంద్రమంత్రి ప్రకాష్‌ జావడేకర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ పాలనపై ఛార్జిషీటు విడుదల చేయనున్నారు బీజేపీ నేతలు.

ఇక కాంగ్రెస్‌ ఈ రేసులో పూర్తిగా వెనుకబడినట్టు కనిపిస్తోంది. ఎంపికచేసిన జాబితాపై కాంగ్రెస్‌ నేతలు కూడికలు, తీసివేతలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు అధికారికంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. 35 మందిని ప్రకటించలేదు. పార్టీ పార్లమెంటరీ సమన్వయ కమిటీకి, నియోజకవర్గ నాయకులకు సమన్వయం లేక ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా అభ్యర్థులకు బీఫారాలను ఇవ్వలేదు. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన 115 మంది జాబితాలోనూ మార్పులున్నా ఆశ్చర్య పోనక్కరలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇవాళ మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మాత్రం తన పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలావరకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక్కడ కూడా ఒకటి రెండు చోట్ల ఎంపికలో ఇబ్బంది ఉందని చెబుతున్నారు. సీనియర్‌ నాయకులు గాంధీభవన్‌ వైపు కన్నెత్తి చూడటం లేదు.

Next Story

RELATED STORIES