Telangana : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ట్వీట్‌ వార్..!

Telangana : తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ట్వీట్‌ వార్..!
Telangana : తెలంగాణాలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

Telangana : తెలంగాణాలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నిన్నటివరకు టీఆర్ ఎస్- బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటే....ఇప్పుడు కాంగ్రెస్ చేరింది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్‌ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అని రాహలు గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. అంతే కాకుండా రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని,పండించిన ప్రతి గింజా కొనాలని సూచించారు.

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒక ఎంపీగా నామమాత్రంగా ట్వీట్లతో సంఘీభావం తెలపకుండా.. పార్లమెంట్‌లో పోరాడాలని సలహా ఇచ్చారు. ఒకే దేశం- ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదన్నారు. తమ పార్టీ ఎంపీలు రోజూ పార్లమెంట్‌ వెల్‌లోకి వెళ్లి పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. నిజాయితీ ఉంటే రాహుల్‌గాంధీ కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి పోరాడాలని సూచించారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు సెటైర్ విసిరారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని, సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని ట్వీటర్ ద్వారా కామెంట్ చేశారు. ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ 2021 ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఆనాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైందని ట్వీట్‌ చేశారు.

రాహుల్ గాంధీ ట్వీట్‌పై మంత్రి హరీష్‌రావు కూడా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండని ట్వీట్‌ చేశారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునే వాళ్లే అయితే.. పార్లమెంట్‌లో తమ ఎంపీలతో కలిసి ఆందోళన చేయండని రాహుల్‌గాంధీకి పిలుపు ఇచ్చారు. రైతుల ఉసురు పోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టండని సలహా ఇచ్చారు. అసలు వన్ నేషన్, వన్ ప్రొక్యూర్‌మెంట్‌పై కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటో చెప్పండని ట్వీట్ చేశారు. రైతుల విషయంలో రాజకీయాలు చేసి, తెలంగాణ సమాజంలో పరువు తీసుకోకండని సలహా ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.

రాహుల్ గాంధీ ట్విటర్‌కు కౌంటర్ ఇచ్చారు పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి. రైతులకోసం టీఆర్‌ఎస్ చేసిన కార్యక్రమాల తరహాలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా అని ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనాలని ఏకంగా సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ధర్నాచేశారన్నారు. బీజేపీలో త్రిపుల్ ఆర్.. కాంగ్రెస్‌లో డబుల్ ఆర్‌లు మోపయ్యారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఐరన్ లెగ్‌ అని.. ఆయనకు ఓట్లపై ప్రేమ ఉందికాని.. రైతులు,ప్రజలపై ప్రేమలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఒకేదేశం- ఒకే సేకరణ అనడం తప్పా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలు వ్యవహారం తెలంగాణాలో రాజకీయ పార్టీల మధ్య వేడిరాజేస్తోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. రాజకీయ పార్టీల వివాదాలపై రైతులు దిగాలు చెందుతున్నారు. ఇన్నాళ్లు పంట పండలేదని బాధపడ్డ అన్నదాతలు.. పండిన పంటను విక్రయించేందుకే పెద్దకష్టమొచ్చిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story