TS : ఖదీర్‌ ఖాన్‌ ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TS : ఖదీర్‌ ఖాన్‌ ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
భర్త మృతికిగానూ 50 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఖదీర్‌ఖాన్‌ భార్య సిద్ధేశ్వరి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

గొలుసు దొంగతనం కేసులో అనుమానితుడిగా మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఖదీర్‌ ఖాన్‌ ఘటనపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెదక్‌కు చెందిన చిరు వ్యాపారి ఖదీర్‌ఖాన్‌ పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందారంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని కోర్టు సుమోటో పిటిషన్‌గా తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాం జీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ఖదీర్‌ఖాన్‌ను ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచిన 14 రోజుల తరువాత ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య ఆరోపిస్తున్నారని..అందువల్ల దీనిపై తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, మెదక్‌ ఎస్పీ, డీఎస్పీ, ఎస్‌హెచ్‌ఓలకు నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలంటూ ఆదేశించింది. విచారణను మార్చి 14వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు తన భర్త మృతికిగానూ 50 లక్షల పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలంటూ ఖదీర్‌ఖాన్‌ భార్య సిద్ధేశ్వరి హైకోర్టులో మంగళవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. మృతి ఘటనపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాన్ని నియమించడంతోపాటు..పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్‌పై మంగళవారం మధ్యాహ్నం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంతోష్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంత ఈ పిటిషన్‌ను సుమోటో పిటిషన్‌తో జత చేయాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story