TS : హన్మకొండ కోర్టుకు బండి సంజయ్

TS : హన్మకొండ కోర్టుకు బండి సంజయ్
అర్ధరాత్రి బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం పోలీసులకు అలవాటుగా మారిందన్నారు ఆయన సతీమణి అపర్ణ

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కాసేపట్లో హన్మకొండ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఒకవేళ న్యాయమూర్తి రిమాండ్ విధిస్తే.. బండి సంజయ్‌ను ఖమ్మం జిల్లా జైలుకు తరలించే అవకాశం ఉంది. రాయపర్తి మీదుగా ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అర్ధరాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్ అరెస్ట్ మొదలు...కోర్టులో ప్రవేశ పెట్టేవరకు ప్రతీదీ పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచారు. కరీంనగర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్కడి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. గంట గంటకు బీజేపీ కార్యకర్తల సంఖ్య పెరుగుతుండడంతో.. పోలీసులు బొమ్మల రామారం పీఎస్‌ నుంచి భువనగిరి తరలించారు. ఈ క్రమంలో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల అద్దాలకు పేపర్లు అడ్డుపెట్టి.. అత్యంత చాకచక్యంగా బండి సంజయ్‌ను భువనగరి తరలించారు.

భువనగిరిలో న్యాయమూర్తులు సెలవులో ఉండడంతో.. అక్కడి నుంచి నాటకీయ పరిణామాల మధ్య కాన్వాయ్‌లో హన్మకొండకు తరలించారు. ఈక్రమంలో పెంబర్తి వద్ద వరంగల్ జిల్లా పోలీసులకు బొమ్మల రామారం పోలీసులు బండి సంజయ్‌ను హ్యాండోవర్ చేశారు. కాన్వాయ్ మార్చే క్రమంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. అక్కడి నుంచి బండి సంజయ్‌ను పాలకుర్తి తరలించిన పోలీసులు అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కొండూరు, బురాన్‌పల్లి మీదుగా వర్దన్నపేట.. వరంగల్ తరలించారు.

అర్ధరాత్రి బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేయడం పోలీసులకు అలవాటుగా మారిందన్నారు ఆయన సతీమణి అపర్ణ. అరెస్ట్‌ సమయంలో కనీస మర్యాదలు కూడా పాటించలేదన్నారు. తమ కుమారులపై దాడి చేయమని ఏ చట్టాలు చెబున్నాయో కరీంగనర్‌ పోలీసులు చెప్పాలన్నారు అపర్ణ. అరెస్టులు.. జైళ్లు సంజయ్‌కు కొత్తేమీ కాదని.. కుటుంబ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story