TSRTC: టీఎస్ఆర్‌టీసీ బోర్డు కీలక నిర్ణయాలు.. త్వరలోనే పలు సంస్కరణలు..

TSRTC: టీఎస్ఆర్‌టీసీ బోర్డు కీలక నిర్ణయాలు.. త్వరలోనే పలు సంస్కరణలు..
TSRTC: ఓ వైపు అప్పుల భారం, మ‌రోవైపు పెరుగుతున్న డీజీల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మ‌నుగడ ప్రశ్నార్దకమైంది.

TSRTC: ఓ వైపు అప్పుల భారం, మ‌రోవైపు పెరుగుతున్న డీజీల్ ధ‌ర‌ల‌తో ఆర్టీసీ మ‌నుగడ ప్రశ్నార్దకమైంది. ఆర్టీసీని గాడిన పడేయడానికి యాజ‌మాన్యం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా పెద్దగా ప్రయోజ‌నం లేకుండా పోతోంది. రోజువారీగా పెరుగుతున్న డీజీల్ ధ‌ర‌లకు తోడు ప్రభుత్వం నుండి రావాల్సిన బ‌కాయిలు స‌కాలంలో రాక‌పోవ‌డంతో వేత‌నాలు కూడా స‌రైన స‌మాయానికి చెల్లించ‌లేని దుస్థితికి చేరుకుంది టీఎస్ ఆర్టీసీ.

కొన్నాల్లుగా సంస్థకు పూర్తి స్థాయి ఎండీ, బోర్డు లేక పాలనాప‌ర‌మైన నిర్ణయాలు తీసుకోవ‌డంలో జాప్యం జరిగింది. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి స‌జ్జనార్‌ను, సంవత్సరాల త‌ర‌బ‌డి ఖాళీగా ఉన్న చైర్మన్ ప‌ద‌విని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్దన్ తో ప్రభుత్వం భ‌ర్తీ చేయడం ఊరటనిచ్చింది.ఆర్టీసీని చ‌క్కదిద్దే క్రమంలో ముంద‌స్తుగా కార్మికుల‌కు వేత‌నాలు మొద‌టి వారంలోనే వ‌చ్చేలా చేయ‌డంలో స‌జ్జనార్ మొద‌టి విజ‌యం సాధించారు.

అయితే వేత‌న స‌వ‌ర‌ణ‌లు, డీఏల పెంపు విష‌యంలో వాయిదా ప‌ర్వాన్నే కొనసాగిస్తుండ‌టంతో కార్మిక సంఘాలు అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రక‌టించ‌డం, సంస్థలో అంద‌రూ ఉద్యోగులుగానే ప‌రిగ‌ణిస్తామ‌ని సీఎం పేర్కొనడంతోకార్మిక సంఘాలు నామ‌మాత్రంగా మిగిలిపోయాయి. ఇన్ని స‌మ‌స్యల మ‌ధ్య ఆర్టీసీని గాడీలో పెట్టేందుకు డీజీల్ సెస్ పెంపుకు తెర‌తీసారు స‌జ్జనార్ .

చార్జీలు పెంచాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాద‌న‌లు పంపినా ఎలాంటి స్పంద‌న రాక పోవ‌డంతో .. ఆర్థిక భారం త‌ప్పించుకునేందుకు సంస్థలో పాత ఫైల్స్ ను తిర‌గేసారు స‌జ్జనార్. ఎన్నో ఎళ్ల క్రితం రూపొందించిన సెస్ పెంపు అస్త్రాన్ని ప్రయోగించారు. వీటితో పాటు చార్జీలలో చిల్లర స‌రిచేస్తామంటూ బాదుడుకు తెర‌తీసారు. దీంతో ఆర్థిక భారం కాస్తా త‌గ్గింద‌ని యాజ‌మాన్యం చెబుతోంది.

బస్ భవన్లో జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి తో పాటు కేంద్ర రోడ్లు భవనాల శాఖ నుండి ప్రతినిధి,ఆర్ అండ్ బీ ఈఎన్సీ హాజరయ్యారు. డీజీల్‌ సెస్‌ పెంపుతో పాటు తార్నాకాలో ఉన్న ఆర్టీసీ ఆసుప‌త్రిని సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిగా మార్చి అంద‌రికీ అందుబాటులోకి తెచ్చేందుకు చేసిన ప్రతిపాదన‌కు కూడా బోర్డు ఆమోదం తెలిపిన‌ట్టు ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా ఇటీవల చేపట్టిన చర్యలు లాభాల బాట పట్టక పోయినప్పటికీ కొంత మేర ఆదాయం పెరిగిందని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈమధ్య పెంచిన ఛార్జీల ద్వారా సుమారు 20 నుండి 30 కోట్ల ఆదాయం సమకూరిందని స్పష్టం చేశారు. ఒకటి రెండు నెలల్లో సుమారు వెయ్యి 60 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీని గాడిన పెట్టేందుకు రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలకు తెరలేపనుంది బోర్డు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ స్థలాలు లీజుకు ఇవ్వడం, బస్టాండ్లలో మెడికల్ షాప్స్ పెట్టడం లాంటి వాటిపైన దృష్టి పెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story