TS: ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ

TS: ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ
15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి.... స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

తెలంగాణలో ఏడాదిలోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే... ప్రతిపక్షాలు శాపనార్థాలు పెడుతున్నాయని రేవంత్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ LB స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.


ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ LB స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్‌ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, CS శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కోర్టు అడ్డంకులను తొలగించి 7వేల 94 మందికి సర్కారీ నౌకర్లు కల్పించామని వివరించారు. విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నెరవేర్చలేదని సీఎం మండిపడ్డారు. గత సీఎం కేసీఆర్‌ తన పరివారం గురించి మాత్రమే ఆలోచిస్తోందని ఆక్షేపించారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో నర్సులదే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్‌ కొనియాడారు.


నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్లలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్న భట్టి... ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కొత్త నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖలో మరో 5 వేల ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ విధానాన్ని పక్కాగా అమలుచేయడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో సింహభాగం దక్కాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు.

ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వ చొరవను కొనియాడారు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమించాం. ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గత ప్రభుత్వం వాళ్ల కుటుంబసభ్యుల గురించి మాత్రమే ఆలోచించింది. తెలంగాణ కోసం పోరాడిన యువతపై కేసులు పెట్టి వేధించింది. కుమార్తెను ప్రజలు ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కేసీఆర్‌ ఆలోచించలేదు. ’అని సీఎం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story