నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యపై భగ్గుమన్న విద్యార్ధి సంఘాలు..!

నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యపై  భగ్గుమన్న విద్యార్ధి సంఘాలు..!
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు విద్యార్ధి సంఘాల నేతలు.

నిరుద్యోగి సునీల్‌ నాయక్‌ ఆత్మహత్యపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు విద్యార్ధి సంఘాల నేతలు. గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్‌లోని పలు చోట్ల, హన్మకొండలో ఆందోళనలు చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో సునీల్‌కు పోస్టుమార్టం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు.. పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు.

వెంటనే లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నినాదాలు చేస్తూనే మార్చురీలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో.. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్‌ సహా మొత్తం 27 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్‌నాయక్‌ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యేనంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం తేజావత్‌సింగ్‌ తండాకు చెందిన సునీల్‌.. మార్చి 26న వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఖాళీల భర్తీపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటూ పురుగుల మందు తాగాడు. సునీల్‌ నాయక్‌కు మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించి వైద్యం అందించారు.

కానీ, నిన్న తెల్లవారుజామున 3 గంటలకు సునీల్ నాయక్‌ తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం తరువాత ప్రత్యేక ఎస్కార్ట్‌ సాయంతో మృతదేహాన్ని స్వగ్రామం తేజావత్‌సింగ్‌ తండాకు తరలించారు. సునీల్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన ఆంబులెన్స్‌ను తండా వాసులు, బంధువులు, స్నేహితులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు అంబులెన్స్‌ను కదలనివ్వబోమని పట్టుబట్టారు. నాయక్‌ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సునీల్‌ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు గ్రామంలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు కేటాయిస్తామని మంత్రి సత్యవతి తెలిపారు. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు సహాయం అందించారు.

నోటిఫికేషన్ ఇవ్వకుండా, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్న సీఎం కేసీఆర్‌పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని బండి సంజయ్‌ మండిపడ్డారు. గూడూరు వెళ్తున్న బండి సంజయ్‌ను నర్సంపేట వద్దే పోలీసులు అడ్డుకున్నారు. గూడూరులో బీజేపీ శ్రేణులు గంటపాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హన్మకొండలోని మంత్రి ఎర్రబెల్లి ఇంటి వద్ద కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story