Chinna jeeyar swamy: చినజీయర్ స్వామి ఆశ్రమంలో 2500 మంది కళాకారులతో మూడు రోజుల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన..

Chinna jeeyar swamy (tv5news.in)

Chinna jeeyar swamy (tv5news.in)

Chinna jeeyar swamy: కూచిపూడి కళకు ఇలలో వెలకట్టలేని ఖ్యాతిని సముపార్జించిన కళాకారుడు.

Chinna jeeyar swamy: కూచిపూడి కళకు ఇలలో వెలకట్టలేని ఖ్యాతిని సముపార్జించిన కళాకారుడు. ఎందరో ఔత్సాహికులను ఈ నాట్యంలో ఉద్ధండులుగా మార్చిన శిల్పకారుడు. ఆయనే పద్మభూషణ్ వెంపటి చినసత్యం. ఆయన 92వ జయంతిని ప్రపంచమంతా ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఘనంగా నిర్వహించారు. అలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి వేదికైంది.

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమం. మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకలు.. మువ్వల సవ్వడితో మురిసిపోయాయి. కళాకారుల లయబద్దమైన నాట్యంతో వైభవంగా జరిగాయి. తెలుగు వారు గర్వంగా చెప్పుకునే తెలుగింటి నాట్యం.. కూచిపూడి. దీని ప్రాశస్త్యం తెలుగు గడపలోనే ఆగిపోలేదు. నేల నలుచెరుగులా విస్తరించింది.


అందుకే తమిళనాడు, కర్నాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, కోల్ కత్తా నుంచి వచ్చిన దాదాపు రెండున్నర వేల మంది కళాకారుల నృత్య ప్రదర్శనలతో స్వామివారి ఆశ్రమం పులకించింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ మంగళాశాసనాలతో కళాకారుల జీవితాలు ధన్యమయ్యాయి. తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ, సేవ్‌కూచిపూడి ఆర్టిస్ట్స్‌.. ఈ రెండూ సంయుక్తంగా ఈ మహోత్సవాలలో భాగమయ్యాయి.

ఆ నటరాజుకు ప్రీతిపాత్రమైన నాట్యాన్ని.. శ్రీరామనగరంలోని ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఐదు వేదికలపై... కూచిపూడి కళాకారులు అద్భుతంగా.. నభూతో అన్న రీతిలో ప్రదర్శించారు. అది కూడా ఉదయం నుంచి రాత్రి వరకు నిర్విరామంగా నృత్యం చేస్తూ.. కూచిపూడికి ఉన్న ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పారు. వెంపటి చిన సత్యానికి ఈ విధంగా ఘన నివాళులు అర్పించారు.



కొవిడ్ తరువాత రెండున్నర వేల మంది కళాకారులతో ఇంత పెద్ద ఎత్తున నృత్యమహోత్సవాలు జరగడం, ఈ స్థాయిలో భారీ ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. ఆధ్యాత్మిక సౌరభాలతో, సాహితీ సుగంధ పరిమళాలను వెదజల్లుతూ జరిగిన ఈ అత్యద్భుతమైన కార్యక్రమానికి తమ ఆశ్రమం వేదికైనందుకు.. చినజీయర్ స్వామి ఎంతో ఆనందించారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతున్న కళాకారులు... కూచిపూడి నాట్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని దీవించారు.

హైందవ ధర్మాన్ని ఆచరిస్తూ.. అందరూ అనుసరించేలా, అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఆధ్యాత్మిక ప్రసంగాలతో జాతిని మేల్కొలిపే చినజీయర్ స్వామి సమక్షంలో... రోజూ సాయంత్రం మహాబృంద నాట్యాన్ని ప్రదర్శించారు కళాకారులు. ఆశ్రమంలో నృత్యవేదికలను సందర్శించిన స్వామీజీ...కళాకారులకు మంగళాశాసనాలు అందించారు.


కూచిపూడి నృత్యమహోత్సవాన్ని సాక్షాత్తూ ఆ నటరాజే మెచ్చేలా, కన్నుల పండువగా నిర్వహించిన సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్స్ వ్యవస్థాపకురాలు భావన పెదప్రోలును స్వామివారు అభినందించారు. సద్భావనతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడూ తమ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఇన్ని వేల మంది కళాకారులను తయారుచేసిన నాట్యగురువులను చినజీయర్ స్వామి ప్రశంసించారు.

పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని సినీ దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు స్వామివారు మంగళాశాసనాలతో అందించారు. కూచిపూడి కళకు జీవితాన్ని అంకింత చేసిన, విశేష సేవలు అందించిన ప్రముఖ నాట్యగురువులను చిన్నజీయర్‌ స్వామీజీ సన్మానించారు. కూచిపూడి వెలుగు దివ్వెలు.. ప్రపంచం నలుమూలలా, దశదిశలా ప్రసరించేలా, కాంతినిచ్చేలా విశ్వవ్యాపితం చేయాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు.



వచ్చే ఫిబ్రవరి లో నిర్వహించనున్న సమతా మూర్తి ఆవిష్కరణ సందర్భంగా వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల చివరి రోజు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ తంగెడ కిషన్ రావు, రిజిస్టర్ బట్టు రమేష్, కూచిపూడి సిద్ధేంద్రయోగి కళాపీఠం ప్రిన్సిపల్ వేదాంతం రామలింగ శాస్త్రి, కాంచీపురం శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జయరామిరెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి అనురాధకు పద్మశ్రీ శోభానాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని చిన్న జీయర్ స్వామిజీ అందించారు. ప్రొఫెసర్ వసంత్ కిరణ్, శ్రీనివాస్ చక్రవర్తి కథాకళి కూచిపూడి మేళవింపుతో ప్రదర్శించిన నరసింహ అవతారం అందర్నీ విశేషంగా అలరించింది.

Tags

Read MoreRead Less
Next Story