Vemulawada: కిక్కిరిసిన రాజ‌న్న క్షేత్రం…ద‌ర్శ‌నానికి 6గంట‌ల స‌మ‌యం…

Vemulawada:  కిక్కిరిసిన రాజ‌న్న క్షేత్రం…ద‌ర్శ‌నానికి 6గంట‌ల స‌మ‌యం…
భక్తులకు తప్పని పాట్లు

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దాంతోపాటు ఆదాయంసైతం గణనీయంగా వస్తోంది. కోడె మొక్కుల ఆదాయంతో సమానంగా ప్రసాద విక్రయాల ద్వారా.. ఆదాయం సమకూరుతోంది. కోడెమొక్కుల ద్వారా లక్షల రూపాయల ఆదాయం సమకూరుతున్నా.. వాటిని అనుకున్న రీతిలో సంరక్షించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేములవాడ రాజన్నస్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. 'సమ్మక్క-సారలమ్మ' జాతర సమీపిస్తుండటంతో ఇటీవల భక్తుల తాకిడి పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. భక్తులకు ప్రసాదాలుగా పులిహోర, సిరా, అభిషేకం లడ్డూ అందుబాటులో ఉంటాయి. రెండేళ్లలో సుమారు 16 నుంచి 18 కోట్ల ఆదాయం సమకూరగా.. ప్రస్తుతం 18 నుంచి 20 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రసాదం లడ్డూలు తీసుకోవడానికి మాత్రం అనేక ఇబ్బందుల పడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


ఆలయ ఆదాయంలో ప్రధాన పాత్ర కోడె మొక్కులదే. కానీ, కోడెల నిర్వహణ, వాటి ఆరోగ్యంపై మాత్రం అధికారులు శ్రద్ద చూపడం లేదని భక్తులు వాపోతున్నారు. పర్యవేక్షణ కొరవడి కోడెలు బక్కచిక్కడం, ఇతర వ్యాధులు సోకి మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు మాత్రం భక్తుల తాకిడి బట్టి ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు. కోడెల సంరక్షణకు ప్రత్యేక పద్ధతి అవలంభిస్తున్నట్లు స్పష్టంచేస్తున్నారు. కోడెల సంరక్షణకు అధునాతన షెడ్డు నిర్మాణంతోపాటు.. పూర్తిస్థాయిలో పశు వైద్యున్ని అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లడానికి ముందు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఆనవాయితీ ప్రకారం వేలాది మంది భక్తులు తరలివస్తుండడంతో రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఈ సందర్భంగా వారు ఆలయ కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం సర్వదర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న కారణంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి స్వామివారి దర్శనం త్వరితగతిన సాగే విధంగా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. గర్భాలయంలో అభిషేకం, అన్నపూజ నిలిపివేయడంతో క్యూ లైన్లు వేగంగా కదిలాయి. మరోవైపు బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. భారీ సంఖ్యలో భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలోనూ భక్తుల రద్దీ కొనసా గింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. Vemulawada Temple

Tags

Read MoreRead Less
Next Story