రుణ భారం.. ఉప సర్పంచి దంపతుల ఆత్మహత్య

రుణ భారం.. ఉప సర్పంచి దంపతుల ఆత్మహత్య
అప్పిచ్చిన వాళ్ల వేధింపులు ఒక పక్క, కుటుంబం గడిచే మార్గం ఏదని ఆలోచనలు మరోపక్క.

ఊరికి ఉపసర్పంచి.. అయినా ఊళ్లో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించట్లేదు. అప్పిచ్చిన వాళ్ల వేధింపులు ఒక పక్క, కుటుంబం గడిచే మార్గం ఏదని ఆలోచనలు మరోపక్క. ఈ క్రమంలో ఆ భార్యాభర్లలిరువురూ ఆత్మహత్యే శరణ్యమని భావించారు. తమతో పాటు అభం శుభం తెలియని తమ చిన్నారులకూ పురుగుమందు కలిపిన పానీయం ఇచ్చారు. చికిత్స పొందుతూ దంపతులు మ‌ృతి చెందగా, చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన వడ్తియా బాబురావు (26) బీటెక్ పూర్తి చేశారు. గత ఎన్నికల్లో వార్డు సభ్యునిగా గెలుపొంది ఉపసర్పంచిగా నియమితులయ్యారు. ఇల్లు కట్టుకునేందుకు, మరి కొన్ని ఇతర అవసరాలకు అప్పులు చేశారు. అప్పు ఇచ్చిన వారు రుణం తీర్చమంటూ బాబూ రావు మీద ఒత్తిడి తీసుకొచ్చేవారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు బాబు రావు.

ఈనెల 6న శీతల పానీయంలో పురుగు మందు కలిపి భార్య రంగమ్మ (24), చిన్నారులు మహానీత్ (4), మనస్విని(3) లకు తాగించి, భార్యాభర్తలిద్దరూ తాగారు. దంపతులిద్దరూ ఆదివారం అర్థరాత్రి మరణించారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారులిరువురినీ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మహానీత్ కోలుకోగా, మనస్విని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఎమ్మెల్యే రాములు నాయక్ ఉపసర్పంచ్ దంపతులు భౌతిక కాయాలకు నివాళులర్పించారు. బాబూరావు తల్లి అచ్చమ్మ ఫిర్యాదు మేరకు రుణం కోసం ఒత్తిడి తీసుకు వచ్చారని, దీంతో తన కొడుకు మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరు మున్నీరవుతోంది. బాబూరావును ఇబ్బంది పెట్టిన శంకర్, స్వరూప, సాధిక్ అలీ, మరో మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story