Vijayashanthi : హస్తం గూటికి విజయశాంతి

Vijayashanthi : హస్తం గూటికి విజయశాంతి
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి సరిగ్గా 24 గంటలు తిరగకుండానే పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలలోకి రాములమ్మని పార్టీ తీసుకుంది. ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించింది. మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మరోవైపు మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కూడా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించారు. ఈ జాబితాలో సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లురవి, కోదండ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్దేశ్వర్, అలీబిన్ ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఓబెద్దుల కోత్వాల్, రామ్మూర్తి నాయక్‌తోపాటు పలువురు ఉన్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అని విజయశాంతి పేర్కొన్నారు. కేసిఆర్ ను శాశ్వతంగా ఫాంహౌస్ కు పరిమితం చేయాలనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ లో చేరినట్లు వెల్లడించారు.అయితే గత కొంత కాలంగా బీజేపీ పార్టీతో విజయశాంతి అంటిముటనట్టు ఉంటున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించి కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుండి బీజేపీకి ఆమె మరింత దూరం ఉంటూ వచ్చారు. అంతే కాకుండా పలు సందర్భాల్లో తెలంగాణ వ్యతిరేకులతో స్టేజ్ పంచుకున్నప్పుడు విజయశాంతి మధ్యలోనే వెళ్ళిపోయారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆమె అనేక సార్లు అసంతృప్తిని పరోక్షంగా బయట పెట్టారు. ఇక బీజేపీ బహిరంగ సభలకు సైతం ఆమె డుమ్మా కొట్టారు. కాగా ఇటీవల మోడీ తెలంగాణ పర్యటన సందర్బంగా స్వాగతం పలికిన విజయశాంతి వెంటనే బీజేపీకి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ ఉన్న బీజేపీ.. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోదీ వంటి నేతలు కేసీఆర్‌ను అవినీతిపరుడని పేర్కొన్నా, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కార్యకర్తలు, ప్రజలు, ఉద్యమకారుల్ని బీజేపీ పిచ్చోళ్లను చేసిందన్నారు. బీజేపీది తెర ముందు ఒకమాట మాట్లాడుతూ.. తెరవెనుక బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు రాములమ్మ.

Tags

Read MoreRead Less
Next Story