బండి సంజయ్ సవాల్‌పై తీవ్రంగా స్పందించిన టీఆర్‌ఎస్!

బండి సంజయ్ సవాల్‌పై తీవ్రంగా స్పందించిన టీఆర్‌ఎస్!
భద్రకాళీ అమ్మవారిని కించపర్చడం కాదు.. దమ్ముంటే తన కన్నతల్లిని తీసుకురావాలంటూ బండి సంజయ్‌కు ప్రతి సవాల్ విసిరారు.

వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ అమ్మవారి దగ్గర చర్చకు సిద్ధం కావాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విసిరిన సవాల్‌కు టీఆర్‌ఎస్ స్పందించింది. భద్రకాళీ అమ్మవారిని కించపర్చడం కాదు.. దమ్ముంటే తన కన్నతల్లిని తీసుకురావాలంటూ బండి సంజయ్‌కు ప్రతి సవాల్ విసిరారు టీఆర్‌ఎస్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.

2 లక్షల కోట్లకుపైగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కడితే రాష్ట్రానికి రావల్సిన వాటా ఇవ్వకుండా లక్ష కోట్లకుపైగా ఎగవేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ఆ నిధులు తీసుకురావాలని నరేందర్ సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో మత చిచ్చు రేపినట్లు... తమ దగ్గర చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

అటు బండి సంజయ్ విసిరిన సవాల్‌పై ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. 1120 కోట్లతో వరంగల్ నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వినయ భాస్కర్ అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, బండి సంజయ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

ఎన్నికలు రాగానే బీజేపీకి అభివృద్ధి గుర్తుకు వస్తుందని, గుళ్లు గోపురాలు గుర్తుకు వస్తాయని వినయభాస్కర్ ఎద్దేవా చేశారు. కానీ టీఆర్‌ఎస్ అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుంటుందంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story