తెలంగాణలో ప్రకృతి అందాలు.. ఒక్కో కిలోమీటర్ దూరంలో ఒక్కో జలపాతం

పచ్చని అడవులు... జలజల జాలువారే సెలయేర్లు... నిండుకుండల్లా చెరువులు... ఉరకలేసే జలపాతాలు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా భీమగుండం జలపాతం వద్ద దృశ్యాలివి. ఎత్తయిన కొండలు... లోతయిన లోయలు... ఎటుచూసినా ప్రకృతి అందాలతో అలరారుతున్న జలపాతం సరైన రోడ్డు, రవాణా లేక నిరాదరణకు గురవుతోంది.
అసిఫాబాద్ నుంచి 60 కిలో మీటర్ల దూరంలోని సిర్పూర్-యూ మండల కేంద్రం వరకు బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి 10 కిలో మీటర్ల దూరంలోని బాండెయెర్ గ్రామం వరకు ఆటోలు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి కాలినడకన బురద రోడ్డులో వెళ్తే భీమగుండం జలపాతం వద్దకు చేరుకోవచ్చు. ఒక్కో కిలోమీటర్ దూరంలో ఒక్కో జలపాతం ఉంటుంది. జలపాతాలు చూడాలని అనుకునే వారు 3 కిలోమీటర్లు అత్యంత కఠినమైన రోడ్లపై నడవకతప్పని పరిస్థితి. ఈ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
భీమగుండం జలపాతం పక్కన ఆదివాసీ ఆరాధ్య దైవమైన భీమన్న దేవుని గుడి ఉంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని గిరిజన ఆదివాసీలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంటలు వేసే సమయంలో విత్తనాలను భీమన్న ఆలయానికి తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తే దిగుబడి భారీగా ఉంటుందని అక్కడి వారి విశ్వాసం. పరిసర ప్రాంతాల్లోనే సామూహిక భోజనాలు చేస్తారు. భీమగుండం జలపాతంలో స్నాహం చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు.
వేసవిలో జలపాతంలో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఎత్తయిన కొండల్లో గుహ కనిపిస్తుంది. గుహను చూసేందుకు వేసవిలో పెద్ద సంఖ్యలో జనం తరలివస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పిక్నిక్ స్పాట్‌గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సరైన రోడ్డు, రవాణా, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com