గిప్పుడీ వానలేంది.. గిట్ల సతాయిస్తున్నయి..

గిప్పుడీ వానలేంది.. గిట్ల సతాయిస్తున్నయి..

సలికి సచ్చిపోతమనుకుంటే.. వర్షాలొచ్చి వరదల్లో కొట్టుకుపోయేలాగున్నం.. భాగ్యనగర వాసులు ఎన్నడన్నా కనీ వినీ ఎరుగుదురా గిన్ని వర్షాలు.. రోడ్ల మీద ఆ నీళ్లేంటి.. బోట్లల్లో ఆ తిరుగుడేంది. వర్షాకాలం వచ్చిపోయిందనుకుంటే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలేంటీ వర్షాలు.. వరదల కత అని దీనిపై వాతావరణ కేంద్రాలు, శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తున్నారు. మూడు, నాలుగు నెలల దేశ వ్యాప్త లాక్డౌన్‌తో కాలుష్యం తగ్గి గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ శాతం పెరిగినట్లు గుర్తించారు. దాంతో వరుస అల్పపీడనాలతో నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం, షీర్ జోన్లు ఇవన్నీ ప్రస్తుత అధిక వర్షాలకు కారణమవుతాయని చెబుతున్నారు.

దీనికి తోడు ఏటా జూన్‌లో కేరళ ద్వారా దేశంలోకి ప్రవేశించి నైరుతి రుతుపవనాలు జూలైకి రాజస్థాన్ వరకు వెళతాయి. ఆ తరువాత సెప్టెంబరు నుంచి వెనక్కి నిష్క్రమిస్తాయి. ఇవి ఎంత త్వరగా నిష్క్రమించాయనే దాన్ని బట్టి వానాకాలం లెక్కలుంటాయి. గత 11 ఏళ్లలో ఒకే ఒక్కసారి 2018లో మాత్రమే అత్యంత ఆలస్యంగా సెప్టెంబరు 29న రాజస్థాన్ నుంచి వాటి నిష్క్రమణ ప్రారంభం కాగా తిరిగి ఈ ఏడాది అంతకన్నా ఒక రోజు ముందు అంటే గత నెల 28న వెనక్కి వెళ్లడం మొదలైంది. అయితే వాటిని మధ్యప్రదేశ్‌లో బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలు, అల్పపీడనాలు అడ్డుకున్నాయి. దీంతో ఇవి తెలంగాణ నుంచి ఎప్పుడు నిష్క్రమిస్తాయనేది శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. బంగాళాఖాతం ప్రశాంతంగా ఉంటేనే రుతుపవనాలు వెనక్కి వెళతాయని అంటున్నారు. గత 11 ఏళ్లలో 2010,2016లో మాత్రమే అక్టోబర్ 28 వరకు తెలంగాణలో రుతుపవనాల నిష్క్రమణ పూర్తికాలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునారావృతమైందని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

వీటితో పాటు ఉత్తర దక్షిణ, తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య గాలుల ప్రవాహ ద్రోణులు ఏర్పడుతున్నాయి. వీటినే షీర్ జోన్లని వాతావరణ పరిభాషలో పిలుస్తారు. ఇవి గాలుల ప్రవాహనికి చల్లబడి తేమను తీసుకొస్తాయి. ఉదాహరణకు ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. అది మంగళవారానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

ఇదే సమయంలో తూర్పు-పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి 1.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. వరకూ ఇదే ఉపరితల ఆవర్తనం మీదగా వెళుతోంది. ఈ ఉపరితల ఆవర్తన గాలుల మధ్య నుంచి షీర్‌జోన్‌ వెళ్లింది. దీని వల్ల ఒత్తిడి మరింత పెరిగి అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తన ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల వైపు తేమగాలులు మేఘాలతో వస్తున్నాయి. అందుకే ఇప్పుడు భారీగా వానలు పడుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వాతావరణం జూన్‌-సెప్టెంబరు మధ్యలో ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఈసారి అక్టోబరులోనూ కొనసాగుతుండటం తెలంగాణ ప్రజలను కలవరపాటుకి గురి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story