Free Bus Travel: సోనియా పుట్టిన రోజున మహాలక్ష్మీ పథకం ప్రారంభం ?

Free Bus Travel:  సోనియా పుట్టిన రోజున మహాలక్ష్మీ పథకం ప్రారంభం ?
తెలంగాణ CM రేవంత్ రెడ్డి తొలి సంతకం మహాలక్ష్మీ పథకం ఫీలు పైనే

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారంటీల్లో రెండింటిని అమలు చేయాలని నిర్ణయించింది.ఈనెల 9న సోనియా పుట్టినరోజు పురస్కరించుకొని మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సమావేశంకానున్నారు. అనంతరం మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అందులోభాగంగా తొలుతరెండింటిని అమలు చేయాలని నిర్ణయించారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేయనున్నట్లు వెల్లడించటంతో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలోఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తమిళనాడులో కేవలం నగర, పట్టణప్రాంతాల్లోని సీటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఆ వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ రంగులో బస్సుల్నిఅందుబాటులోకి తెచ్చారు. కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకోసం మహిళలంతా స్మార్ట్‌కార్డ్‌ల కోసం అప్లై చేసుకోవాలని సూచించింది. అవివచ్చేవరకు ప్రభుత్వం గుర్తించి ఏదైనా గుర్తింపుకార్డుతో ప్రయాణానికి అనుమతిచ్చారు.



ఐతే కర్ణాటక, తమిళనాడుతోపోలిస్తే రాష్ట్రంలో మహిళాజనాభా తక్కువగా ఉందన్న అధికారులు ఆ పథకం అమలుతో ఆర్ధికంగా కొంత తక్కువ భారమే పడుంతుందని భావిస్తున్నారు. ఆ పథకం అమలుతీరును కర్ణాటకలో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేయాలంటే..ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారనేది లెక్కతేలాల్సి ఉంటుంది. అందుకోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రారంభించారు. జీరో టికెట్ విధానంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారో లెక్కించే వెసులుబాటు ఉంటుంది. కర్ణాటక తరహావిధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ఏడాదికి 2వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని RTC అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే 700కోట్లు వ్యయం కానున్నట్లు భావిస్తున్నారు. మహిళలకు ఉచిత పథకం ప్రారంభమైతే RTC కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం రీయెంబర్స్ చెల్లించాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అమలు చేస్తే ప్రతి నెలా సుమారు 180 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కర్ణాటక విధానాన్నే అమలు చేస్తారా...? లేక మరో విధాన్ని అనుసరిస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశానికి అందుబాటులో ఉండాలని RTC ఎండీ సజ్జనార్‌కు ఇప్పటికే సమాచారం అందింది.ముఖ్యమంత్రితో భేటీలో వివిధ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశం తర్వాత మార్గదర్శకాలతో కూడిన పూర్తి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story