Ys Sharmila : ఇవాళ షర్మిల పార్టీ జెండా, అజెండా ఆవిష్కరణ..!

Ys Sharmila : ఇవాళ షర్మిల పార్టీ జెండా, అజెండా ఆవిష్కరణ..!
Ys sharmila : ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ రాయదుర్గంలోని JRC కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో పార్టీ జెండా, అజెండాల్ని ఆవిష్కరిస్తారు షర్మిల.

Ys Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్దమైంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ రాయదుర్గంలోని JRC కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో పార్టీ జెండా, అజెండాల్ని ఆవిష్కరిస్తారు షర్మిల. దాదాపు గంటపాటు పార్టీ విధివిధానాలపై ఆమె ప్రసంగం ఉండబోతోంది. తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న షర్మిల.. ప్రజలకు చేరువయ్యేందుకు ఏ నినాదాన్ని వినిపిస్తున్నారు, ఎలాంటి లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు అనే దానిపై మరికొద్ది గంటల్లో పూర్తి స్పష్టత రానుంది. ఈ కార్యక్రమానికి విజయమ్మతో పాటు బ్రదర్ అనిల్‌ కూడా హాజరుకానున్నారు.

ఇవాళ YSR 72వ జయంతి సందర్భంగా ముందు ఇడుపులపాయకు వెళ్లి నివాళులు అర్పించారు. షర్మిలతోపాటు బ్రదర్ అనిల్, విజయమ్మ, కొండా రాఘవరెడ్డి కూడా వెళ్లారు. కాసేపట్లో కడప నుంచి ప్రత్యేక విమానంలో అంతా తిరిగి బేగంపేట చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ కార్యక్రమం మొదలవుతుంది.YSRTP జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలి రంగు ఉంటుందని తెలుస్తోంది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపంతోపాటు వైఎస్‌ చిత్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి గ్రామాల్లో జెండా ఆవిష్కరణలకు కూడా శ్రీకారం చూట్టేలా కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు కోసం 4 నెలలుగా భారీ కసరత్తే చేశారు షర్మిల.

జిల్లాల వారీగా నాయకులతో చర్చలు జరిపారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఛలో ఖమ్మం, చలో నల్గొండ పేరుతో సంకల్ప సభలను నిర్వహించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలని హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఉద్యోగ దీక్ష కూడా చేపట్టారు. తెలంగాణలో వర్తమాన పరిస్థితులు, రాజకీయ విశ్లేషణ కోసం పలు సర్వేలు కూడా చేయించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి అభిమానులు తనతో కలిసి వస్తారనే ధీమాతో పార్టీ ఏర్పాటు చేస్తున్నారు షర్మిల. ఆత్మగౌరవ నినాదంతో.. కలిసి వచ్చేనాయకులతో .. రాజకీయంగా ఇక్కడ బలపడేందుకు ప్లాన్ సిద్దం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story