HBD Tarun నువ్వే కావాలి 'తరుణ్'.. బర్త్‌డే స్పెషల్

HBD Tarun నువ్వే కావాలి తరుణ్.. బర్త్‌డే స్పెషల్
అందుకే యావరేజ్ సినిమా చేసినా తరుణ్ కు క్రేజ్ తగ్గలేదు. ఆ టైమ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్

HBD Tarun తరుణ్.. బాలనటుడిగా జాతీయ అవార్డ్ సాధించిన నటుడు. వచ్చింది సినిమా కుటుంబం నుంచే కాబట్టి ఆ లక్షణాలు సలక్షణంగా వచ్చాయి. నటి రోజారమణి, హీరో, నిర్మాత, దర్శకుడు చక్రపాణిల తనయుడిగా బాల్యంలోనే తెరంగేట్రం చేసిన తరుణ్ చిన్న వయసులోనే పెద్ద అవార్డులు సాధించాడు. తర్వాత హీరోగానూ మంచి సక్సెస్ లు సాధించాడు. ప్రస్తుతం అతని కెరీర్ కొంత స్లంప్ లో ఉంది.. అయినా మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్న తరుణ్ పుట్టిన రోజు ఇవాళ.



తరుణ్ తల్లి రోజారమణి కూడా బాలనటిగా రాణించింది. అందుకేనేమో తరుణ్ కూడా బాలనటుడిగా తొలి సినిమాతోనే నంది అందుకున్నాడు. పేరెంట్స్ ఇద్దరూ నటులే కావడంతో వారిచ్చిన ప్రోత్సాహంతో 1990లో ఎనిమిదేళ్ల వయసులోనే వెండితెరపై మెరిసిన తరుణ్ తొలి సినిమా మనసు మమత. నరేష్ హీరోగా నటించిన ఆ సినిమాతో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించి ఎవరీ పిల్లాడు అంటూ అందరి చేత ప్రశంసలు పొందాడు.

ఈ సినిమాతో టాలీవుడ్ లో ఓ మంచి బాలనటుడు దొరికాడని అందరూ అనుకున్నారు. బాలనటుడిగా మరోసారి అవకాశం వచ్చింది. అది కూడా మళ్లీ నరేష్ హీరోగా నటించిన బుజ్జిగాడి బాబాయ్ అనే చిత్రంలో. కానీ తరుణ్ లోని నటనను చూపించింది మాత్రం అంజలి సినిమా. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తరుణ్ అద్భుతంగా నటించాడు. రఘువరణ్, రేవతి, ప్రభువంటి హేమాహేమీలైన నటుల సరసన ఏమాత్రం బెరుకు లేకుండా అత్యంత సహజంగా నటించి శెభాష్ అనిపించుకున్నాడు.



అంజలి తరుణ్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. అతను ఆ వయసుకు తను నటిస్తున్నాననే ఫీలింగ్ లో ఎంత వరకూ ఉన్నాడో కానీ, అంజలిలో తరుణ్ నటన చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా వచ్చిన 1990లో జాతీయ ఉత్తమ బాలనటుడిగా ఎంపికయ్యాడు. అలాగే అంజలిగా నటించిన షామిలినీ అంత త్వరగా ఎవరూ మర్చిపో్లేరు.

అంజలి తర్వాత తరుణ్ దక్షిణాదిలో మోస్ట్ వాంటెడ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారాడు. అంజలి తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా మళ్లీ ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సినిమా బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369. దీనికంటే ముందు మళయాలంలో నటించిన అభయమ్ సినిమాకు జపనీస్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఉత్తమ బాలనటుడిగా అవార్డ్ అందుకున్నాడు తరుణ్.

ఇక ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో చేసిన మరో సినిమా తేజ. ఈ సినిమాకూ ఉత్తమ బాలనటుడిగా నంది అందుకున్నాడు తరుణ్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలోనూ తరుణ్ నటన చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. నటన జీన్స్ లోనే ఉంది కాబట్టే కుర్రాడు అంత ఈజ్ తో నటిస్తున్నాడనుకునేవారు అప్పట్లో.



ఎనిమిదేళ్ల వయసులోనే మొహానికి రంగేసుకున్న తరుణ్ ఆ తర్వాత చాలా వేగంగా ఎదిగాడు. వరుసగా వస్తున్న సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు. తెలుగుతో పాటు తమిళ, మళయాల సీమల్లోనూ మంచి అవకాశాలు వచ్చాయి. కాకపోతే ఇప్పుడే కాదు.. అప్పుడు కూడా బాలలు ప్రధాన పాత్రలతో సినిమాలు రూపొందించేవారు చాలా తక్కువ. అందుకే తరుణ్ ప్రతిభకు తగ్గ సినిమాలు అంజలి తర్వాత రాలేదు.

టీనేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత బాలనటుడిగా చేయలేడు. అలాగే ఆ వయసుకు తగ్గ పాత్రలూ తక్కువగానే ఉంటాయి. దీంతో వచ్చిన గ్యాప్ లో చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తను బాల నటుడిగా మారిన పదేళ్ల తర్వాత మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. మరి అప్పటికే నేషనల్ అవార్డ్ సాధించిన ప్రతిభావంతుడిగా పేరున్న తరుణ్ ఎంట్రీ క్యాజువల్ గా ఉంటే ఎలా. అందుకే మళ్లీ ఉషాకిరణ్ బ్యానర్ లోనే హీరోగా పరిచయం అయ్యాడు. అదే నువ్వేకావాలి. ఆ ఏడాది అఖండ విజయం సాధించిన నువ్వే కావాలి ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

నువ్వే కావాలి తర్వాత తరుణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. అంతేకాదు.. హీరోగా తొలి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ నూ సొంతం చేసుకున్నాడు. ఇంకేం.. తరుణ్ డేట్స్ కోసం సూట్ కేస్ లతో ఎంతో మంది నిర్మాతలు క్యూ కట్టారు...



అప్పటి బడ్జెట్ లెక్కలకు, నువ్వే కావాలి సాధించిన విజయానికి పోల్చి చూస్తే ఎన్నో రికార్డులు బద్ధలై ఉంటాయి. అందుకే తరుణ్ ఓవర్ నైట్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అలాగే ఆ సినిమా స్ఫూర్తితోనే అనేక కథలు, సినిమాలు వచ్చాయి. కానీ ఈ క్రేజ్ ను తరుణ్ సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయాడనేది రెండో సినిమా నుంచే అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద హిట్ తర్వాత అతను చేసిన సినిమా అంకుల్. ఆ తర్వాత చేసిన ప్రియమైన నీకు హిట్ అనిపించుకున్నా.. వచ్చిన క్రేజ్ కు సరిపడేంతగా కాదు.

సినిమా పరిశ్రమలో ఒక హిట్.. అదీ తొలి సినిమా హిట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందనేది తరుణ్ కెరీర్ చూస్తే అర్థమౌతుంది. అందుకే యావరేజ్ సినిమా చేసినా తరుణ్ కు క్రేజ్ తగ్గలేదు. ఆ టైమ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ కూడా ఓ సంచలనంగా మారింది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న కాశీ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి విజయం సాధించి.. ఈ జంటను క్రేజీ పెయిర్ గా నిలిపింది.

క్రేజీ పెయిర్ అనేదీ అన్ని సార్లూ వర్కవుట్ కాని మేటర్. అందుకే నువ్వే కావాలితో ఎంతో క్రేజ్ సంపాదించిన తరుణ్, రిచా ల జంట మరోసారి కలిసింది. చిరుజల్లు పేరుతో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ జంటకున్న క్రేజ్ కొద్దీ ఓపెనింగ్స్ వచ్చినా.. తర్వాత అవి కంటిన్యూ కాలేకపోయాయి..

ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమ్ ఉంది కాబట్టి తమిళ్ లోనూ హీరోగా అవకాశాలు వచ్చాయి. పున్నగైదేశమ్ అనే చిత్రంలో హీరోగా నటించినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నువ్వే కావాలితోనే రైటర్ గా ఫేమ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారిగా మెగాఫోన్ పడుతూ చేస్తున్న సినిమాకు హీరోగా తరుణ్ ను ఎంచుకున్నాడు. అదే నువ్వేనువ్వే. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో తరుణ్ ఖాతాలో మరో హిట్ చేరింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్ తో పోటీ పడి మరీ నటించిన తరుణ్ ఎంతో మందిని ఆకట్టుకున్నాడు.

సినిమా ఇండస్ట్రీ అనేది వైకుంఠపాళి. జాగ్రత్తగా అడుగులు వేస్తేనే జారిపడతాం.. అలాంటి ఏమరుపాటుగా ఉంటే ఇక అంతే. ఈ విషయం తరుణ్ కెరీర్ కు బాగా సూట్ అవుతుంది. సరైన గైడెన్స్ లేకో లేక, కాన్ఫిడెన్స్ బెడిసికొట్టిందో కానీ.. నువ్వే నువ్వే తర్వాత తరుణ్ కు మళ్లీ పెద్ద హిట్ అంటూ ఏదీ రాలేదు. వరుసగా ఎన్ని సినిమాలు చేసినా మహా అయితే యావరేజ్ అనిపించుకున్నాయి తప్ప మళ్లీ అతని కెరీర్ ను నిలబెట్టే సినిమా అంటూ దేన్నీ చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇందుకు తరుణ్ తనను తప్ప ఎవరినీ నిందించుకోలేని పరిస్థితి అనేది అందరికీ తెలిసిందే.

నిన్నే ఇష్టపడ్డాను, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, సఖియా, సోగ్గాడు, ఒక ఊరిలో, నవ వసంతం, భలే దొంగలు, శశిరేఖా పరిణయం, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, యుద్ధం, రీసెంట్ గా వేట.. ఇదీ తరుణ్ వరుస ఫ్లాపుల లిస్ట్. మరి ఇన్ని ఫ్లాపుల తర్వాత ఏ హీరో అయినా మళ్లీ నిలబడతాడా అనేది చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా బాలనటుడిగా చేసి, లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఏ ఆర్టిస్ట్ కూడా ఇన్ని ఫ్లాపుల తర్వాత మళ్లీ స్టార్డమ్ తెచ్చుకున్నాడనేది ఇప్పటి వరకూ చూడలేదు.

అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎన్ని ఫ్లాపులున్నా.. ఒక్క హిట్ కెరీర్ నే మార్చివేయవచ్చు. ప్రస్తుతం అలాంటి హిట్ కోసమే తరుణ్ యుద్ధం చేస్తున్నాడు. కాకపోతే అప్పటి కంటే ఇప్పుడు కాంపీటీషన్ ఎక్కువైంది. వారసులూ పెరిగారు. పైగా తరుణ్ కటౌట్ యాక్షన్ సినిమాలకి పనికిరాదు.. అలాగని ఇంకా లవర్ బాయ్ గా నటించలేడు. అంటే ఇది ఖచ్చితంగా అతనికి ఇబ్బంది కరమైన పీరియడ్. మరి సిట్యుయేషన్ ను ఎలా ఫేస్ చేస్తాడనేది అతను రాబోయే రోజుల్లో ఎంచుకునే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.

ఓ రకంగా ఇప్పుడు శ్రీకాంత్ తర్వాత ఫ్యామిలీ హీరోల కొరత బాగా ఉంది. మరి ఆ వైపుగా ఇంకా హీరోయిజం కోసమే అంటూ గిరి గీసుకోకుండా మల్టీస్టారర్ అయినా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తే ఒకరకంగా తరుణ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ముందు అవకాశాలు రావడమనేది ఇంపార్టెంట్. ఏదేమైనా ఈ బర్త్ డే సందర్భంగానైనా మళ్లీ అతనికి మంచి ఛాన్సులు రావాలని కోరుకుంటూ మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story