డ్రగ్స్‌ కేసు : ముగిసిన నటి ఛార్మీ ఈడీ విచారణ..!

డ్రగ్స్‌ కేసు : ముగిసిన నటి ఛార్మీ ఈడీ విచారణ..!
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత చార్మి ఈడీ విచారణ ముగిసింది.

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత చార్మి ఈడీ విచారణ ముగిసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా దాదాపు ఎనిమిది గంటల పాటు చార్మిని విచారించారు ఈడీ అధికారులు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. కెల్విన్ అకౌంట్లోకి చార్మి పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసిందా అన్న అంశంపైనా కూపీ లాగారు ఈడీ అధికారులు.

చార్మి ప్రొడక్షన్ హౌజ్‌ ఆర్థిక లావాదేవీలతో పాటు అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీలపైనా ఆరా తీశారు. ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యాయనని చార్మి అన్నారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. దర్యాప్తును పూర్తిగా సహకరిస్తానని స్పష్టంచేశారు. ఈడీ అధికారులు అడిగిన బ్యాంకు డాక్యుమెంట్లన్నీ సమర్పించానన్నారు. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు రావాలని పిలిచినా వస్తానని చార్మి తెలిపారు.

మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా ఆగష్టు 31న డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, సెప్టెంబర్ 2న చార్మి విచారణ ముగిసింది. ఇక ఈడీ విచారణ షెడ్యూల్ ప్రకారం తర్వాత నటి రకూల్ ప్రీత్‌సింగ్ వంతు ఉంది. సెప్టెంబర్ 6న రావాల్సిన రకూల్.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చింది. తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సినిమా షూటింగులతో బిజీగా ఉన్నానని.. గడువు కావాలని లేఖలో తెలిపింది.

రకూల్ లేఖపై స్పందించిన ఈడీ అధికారులు.. గడువు ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పారు. నోటీసులో పేర్కొన్నట్టుగా ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టంచేశారు. ఆరో తేదీకి ముందు కానీ... తర్వాత కానీ... విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని రకుల్‌ తెలిపారు. రకుల్‌ చెప్పిన కారణాలు పరిశీలించిన ఈడీ... శుక్రవారమే విచారణకు రావడానికి అనుమతిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story