Gundamma Katha: 'గుండమ్మ కథ'కు 60 ఏళ్లు.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు..

Gundamma Katha: గుండమ్మ కథకు 60 ఏళ్లు.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు..
Gundamma Katha: 'ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ' అనే నాటకం నుండి గుండమ్మ కథ పుట్టింది.

Gundamma Katha: ఏ అంచనాలు లేకుండా వచ్చి.. క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. హిట్ అవ్వదేమో అనుకొని.. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలు కూడా ఉన్నాయి. 60 ఏళ్ల క్రితం విడుదలయిన 'గుండమ్మ కథ' కూడా ఈ తోవకు చెందిందే. 1962 జూన్‌ 7న విడుదలయిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనాన్నే సృష్టించింది. ఈ మూవీ 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గుండమ్మ కథకు సంబంధించిన కొన్ని విశేషాలు..


'ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ' అనే నాటకం నుండి గుండమ్మ కథ పుట్టింది. ముందుగా ఈ కథతో 'మనె తుంబిద హెణ్ణు' అనే సినిమా తెరకెక్కింది. అదే తెలుగులో గుండమ్మ కథగా మారింది. ఎన్‌టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సూర్యకాంతానికి సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే తన పాత్ర పేరు మీదే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.


ఒక దర్శకుడిని అనుకొని.. పరిస్థితులు అనుకూలించక మరో దర్శకుడి చేతికి కథ వెళ్లడం అనేది ఇప్పుడు మాత్రమే కాదు. ఎప్పటినుండో జరుగుతున్నదే. బి. ఎన్. రెడ్డి, పుల్లయ్య లాంటి దర్శకుల పేర్లు పరిశీలించినా గుండమ్మ కథకు దర్శకుడిగా చివరికి కమలాకర కామేశ్వరరావు ఫైనల్ అయ్యారు. విశేషం ఏంటంటే.. ఇది కామేశ్వరరావు డైరెక్ట్ చేసిన మొదటి కమర్షియల్ సినిమా.

ఎన్‌‌టీఆర్ కెరీర్‌లో గుండమ్మ కథ 100వ చిత్రం. అప్పటివరకు 100 చిత్రాలు చేసినా కూడా ఎన్‌టీఆర్.. గుండమ్మ కథలాంటి కమర్షియల్ సినిమాలో ఓ పల్లెటూరి అబ్బాయి పాత్ర చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుండమ్మ కథలో మరో గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ మూవీకి మొదట్లో టైటిల్ కార్డ్ తర్వాత ఆర్టిస్టుల పేర్లు ఉండవు. కేవలం ఫోటోలు మాత్రమే ఉంటాయి. ఎన్‌టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరిలో ఎవరి పేరు ముందు వేయాలని అన్నదానికి పరిష్కారంగా ఫోటోలు అయితే మేలు అనుకుంది మూవీ టీమ్.


గుండమ్మ కథ విడుదలకు 10 రోజుల ముందు ఎల్వీ ప్రసాద్‌ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకలో ప్రీమియర్ వేశారు. అక్కడ ఈ సినిమా చూసినవారంతా కథ ఏమీ లేదంటూ విమర్శించారు. దీంతో మేకర్స్ కూడా సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భయపడ్డారు. కానీ విడుదలయ్యి 60 ఏళ్లు అయినా ఇప్పటికీ గుండమ్మ కథ ఓ క్లాసిక్. ఈ సినిమాను ఈ జెనరేషన్‌ను తగినట్టు రీమేక్ చేయాలని మేకర్స్‌కు ఉన్నా.. గుండమ్మ పాత్ర చేసే నటి దొరకడం అసంభవం.

Tags

Read MoreRead Less
Next Story