నమ్మిన సిద్ధాంతం కోసం బ్లాంక్ చెక్ ఆఫర్స్ ను కాదనుకున్న రియల్ హీరో!

మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి..

నమ్మిన సిద్ధాంతం కోసం బ్లాంక్ చెక్ ఆఫర్స్ ను కాదనుకున్న రియల్ హీరో!
X

ఆవేశం అతని మారుపేరు.. విప్లవపంధా అతని జీవన మార్గం.. ప్రజా సమస్యలే అతని సినిమాకి కథా వస్తువులు.. మామూలు ప్రజలే అతని సినిమాలో పాత్రధారులు.. జేబులో చిల్లిగవ్వ లేకుండానే నిర్మాతా, దర్శకుడుగా మొదటి సినిమా నిర్మించిన కళాజీవి.. ఆర్. నారాయణ మూర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని వ్రాసుకోగలిగిన నిబద్ధత గల కళాకారుడు.. సినిమా.. సినిమా పరిశ్రమ ట్రెండ్స్ కు విరుద్ధంగా వెండితెర నుంచి వర్గరహిత స్వర్గాన్ని కాంక్షిస్తోన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి బర్త్ డే ఇవాళ.

ఆర్ నారాయణమూర్తి.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు ఓ బ్రాండ్. సినిమా నటుడు అంటే వెండితెరపై ఆదర్శాలు వల్లిస్తాడు. నిజ జీవితంలో అందుకు విరుద్ధంగా ఉంటాడు అనే మాటను చెరిపి.. సినిమా జీవితాన్ని గడుపుతోన్న నిజమైన కథానాయకుడు నారాయణమూర్తి. సినిమా ద్వారా తను పదిమందికి ఏం చెబుతున్నాడో దాన్ని ఆచరించి చూపుతోన్న ఆదర్శవంతమైన హీరో. చిరువేషాలతో పరిచయమై.. హీరోగా మారి పెను సంచలనాలు సృష్టించిన చరిత నారాయణమూర్తిది.

వెండితెరను ఎరుపెక్కించిన అతి కొద్దిమంది దర్శకుల్లో అగ్రగణ్యుడు ఆర్ నారాయణమూర్తి. కాసుల వేటలో కమర్షియల్ సినిమా పేరిట వెర్రిమొర్రి వేషాలేస్తోన్న సినిమా పరిశ్రమలో నమ్మిన సిద్ధాంతం కోసం బ్లాంక్ చెక్ ఆఫర్స్ ను కూడా కాదనుకున్న గొప్ప నటుడు నారాయణమూర్తి. నాటి అర్థరాత్రి స్వతంత్రం నుంచి త్వరలో రాబోతున్న దండకారణ్యం వరకూ ఆయనది అన్నల బాట.

అణగారిన వర్గాల ఆర్తనాదాలు కథా వస్తువులు. ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అల్లుకునే కథనాలు.. మాటల్లో తూటాలు.. పాటల్లో ధిక్కార స్వరాలు.. అన్ని సమస్యల పరిష్కారానికి అన్నల బాటే మార్గం అనే నినాదం.. కలిసి వెండితెరపై కనిపిస్తే అది ఆర్ నారాయణమూర్తి సినిమా.

తూర్పుగోదావరి జిల్లా మల్లంపేట గ్రామంలో ఓ పేదరైతు సంతానం నారాయణమూర్తి. హై స్కూల్, కాలేజ్ రోజుల నుంచి వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితుడైనా.. అటు ఎన్టీఆర్, ఏఎన్నార్ లను చూస్తూ వాళ్లలా కావాలనే ఆశనూ పెంచుకున్నాడు. పైగా కుర్రాడు ఎర్రగా దబ్బపండులా మెరిసిపోయేవాడేమో.. అందరూ సినిమాలకు వెళ్లమని ప్రోత్సహించారు కూడా. కానీ అక్కడ సీన్ వేరే కదా.. అయినా దాసరి వంటి వారి ప్రోత్సాహంతో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు.

అయితే నారాయణమూర్తి కలలు కన్న అవకాశాలు మాత్రం రాలేదు. వస్తాయనే నమ్మకమూ పోయింది. అప్పుడే తనే దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. అయినా ఆశయం మంచిదైతే అన్నీ సమకూరుతాయి అన్నట్టుగా మిత్రులంతా తలో చెక్కు వేశారు. ఆ స్నేహితుల కోసమే తన బ్యానర్ కు స్నేహచిత్ర అని పెట్టి తొలి సినిమా అర్థరాత్రి స్వతంత్రం మొదలుపెట్టాడు.. 16న్నర లక్షల పెట్టుబడితో పూర్తయిన ఆ సినిమా అఖండ విజయం సాధించి, సంచలనం సృష్టిస్తోంది.

అర్థరాత్రి స్వతంత్రం విజయంలో వంగపండు ప్రసాదరావు పాటలు, పిఎల్ నారాయణరావు సంభాషణలు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అలాగే తొలి చిత్రమే అయినా దర్శకుడిగా నారాయణమూర్తి టేకింగ్ సూపర్.. అలాగే నటుడిగానూ అదరగొట్టారు నారాయణమూర్తి.. మొత్తంగా ఈ సినిమా సాధించిన విజయం నారాయణమూర్తి లైఫ్ లో సరికొత్త బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.

ఆ తర్వాత వచ్చిన దండోరా సినిమా ఎన్నో ప్రభుత్వాలు చేయలేకపోయిన పనిని చేసి చూపింది. సారా వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. చాలా మంది సారా వ్యసనపరులు ఈ సినిమా చూసిన తర్వాత స్వచ్ఛందంగా ఆ వ్యసనాన్ని మానేశారంటే అర్థం చేసుకోవచ్చు దండోరా ఎఫెక్ట్ ఎంతలా ఉందో..

సమకాలీన సమస్యలనే ఇతివృత్తాలుగా చేసుకుని సినిమాలు రూపొందించే నారాయణమూర్తి చుండూరు దళితుల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కించిన లాల్ సలామ్ మరో సంచలనం. ఈ సినిమా తెరకెక్కించాడని ఆయన్ని ఇంటరాగేట్ చేశారు. సినిమా విడుదలను అడ్డుకున్నారు. నారాయణమూర్తిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా అన్నిటినీ తట్టుకుని ఆసినిమా విడుదల చేసి అద్భుత విజయం సొంతం చేసుకున్నారు..

ఇక భూ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఎర్రసైన్యం మలిదశ భూ పోరాటానికి ఆజ్యం పోసింది. ఎర్రసైన్యం టైమ్ కే నారాయణమూర్తి క్రేజ్ మామూలుగా లేదు. అన్ని సినిమాలూ అఖండ విజయం సాధిస్తూ.. నారాయణమూర్తి అంటే తమ హీరో అని ప్రతి ఒక్కరూ ఫీలయ్యేలా చేశాయి. అప్పటి వరకు అణగారిని వర్గాల కోసం ఎన్ని సినిమాలు వచ్చినా.. నారాయణమూర్తి సినిమాల్లా రియలిస్టిక్ గా... లేవు.. రాలేవు అన్నంతగా పేరు వచ్చింది.

నారాయణమూర్తి సినిమాలన్నీ సమకాలీన సామాజిక, రాజకీయ సమస్యలు ఇతివృత్తంగా తీసినవే. ఆయన రూపొందించిన సినిమాల్లో నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు విధానాలు, డబ్ల్యూటీవో ఒప్పందం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, కుల అంతరాలు, రాజకీయ అతలాకుతలాలు వంటి వాటికి అద్దంపట్టాడు. అందుకే ఆయా విషయాల బాధిత ప్రజలు ఆయన సినిమాలలోని పాత్రలలో మమేకమైపోయారు. నారాయణమూర్తిని మావాడు అనుకున్నారు.

ఓ వైపు ప్రజా సమస్యలతో నారాయణమూర్తి చేస్తున్న సినిమాలు అఖండ విజయం సాధిస్తున్నా మరోవైపు కమర్షియల్ సినిమాల వెల్లువా అలాగే ఉంది. అయినా ఎన్నడూ ఆ వైపు ఆలోచన కూడా చేయలేదు నారాయణమూర్తి. అనవసరమైన సెట్టింగులు, అర్థం లేని ప్రేమ సన్నివేశాలు.. ఐటమ్ సాంగ్స్ వంటివేవీ ఆయన సినిమాల్లో కనిపించవు. సమస్యను బట్టి.. సాధ్యమైనంత వరకూ ఆయా ప్రాంతాల్లోనే రియలిస్టిక్ గా చిత్రీకరణ చేసేవారు. అందుకే గిరిజనుల భూ సమస్యలపై ఎన్నో చట్టాలు చెప్పలేకపోయిన విషయాన్ని ఆయన సినిమాలు చెప్పాయి.. అందరికీ అర్థం అయ్యేలా చేశాయి.

తను నిర్మాత, దర్శకుడు, హీరోగా చేయడమే కాదు.. కొన్ని బయటి బ్యానర్స్ లోనూ హీరోగా నటించారు నారాయణమూర్తి. వీటిలో అన్నిటికంటే అద్భుత విజయం సాధించిన సినిమా ఒరేయ్ రిక్షా. తన గురువు దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో నాటి కమర్షియల్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారాయన. ఈ సినిమాతోనే ఆయనకు పీపుల్స్ స్టార్ అన్న పేరూ స్థిరపడిపోయింది.

అయితే కొన్నేళ్ల పాటు వరుస విజయాలు సాధించిన నారాయణమూర్తి.. ఎర్రసైన్యం తర్వాత వెనకబడ్డారు. అందుకు కారణం.. ఎర్రసైన్యం విజయం తర్వాత చాలామంది స్టార్ హీరోలు కూడా అలాంటి చిత్రాలే చేస్తూ ఆడియన్స్ కు బోర్ కొట్టించారు. వాటిలో కొన్ని విజయవంతమైనా.. అందులోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపేసి నారాయణమూర్తి ట్రెండ్ కు కొంత బ్రేకేశారు. దీనికి తోడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కూడా నారాయణమూర్తి సినిమాల పరాజయాలకు కారణంగా చెప్పొచ్చు.. అయినా ఏనాడూ పంథా వీడని రియల్ పీపుల్ స్టార్ గా ఆయన్ని కీర్తిస్తారు అభిమానులు.

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తను నమ్మి ఆచరిస్తోన్న సిద్ధాంతానికి అనుగుణంగానే సినిమాలు రూపొందించారు. అందుకే మళ్లీ ఊరుమనదిరా చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే అప్పటికే సినిమా నిర్మాణంలో వచ్చిన అనేక మార్పులు నారాయణమూర్తి లాంటి డెడికేటెడ్ ప్రొడ్యూసర్స్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది. అందుకే బడ్జెట్ పరిమితులకులోబడి క్వాలిటీ పరంగా కొన్ని నాసిరకమైన సినిమాలూ చేశారు.

సినిమా రంగంలో నారాయణమూర్తిది 30యేళ్లకు పైగా ప్రస్థానం.. లక్షలాది ప్రజల సమస్యలపై అలుపెరుగకుండా సినిమాలు రూపొందిస్తున్న నైజం.. ఎన్నోసార్లు.. నాటి సినిమా కలెక్షన్ల లెక్కలతో పోలిస్తే.. ఆ యేడాది కలెక్షన్ల రికార్డులను బద్ధలు కొట్టిన చరిత్ర. అయినా నారాయణమూర్తి అంటే ప్రభుత్వ వ్యతిరేక సినిమాలు తీస్తాడనుకున్నారేమో.. ఏ ప్రభుత్వాలూ ఆయనకు గానీ, ఆయన చిత్రాలకు గానీ అవార్డులివ్వలేదు. అయినా ప్రజల ఆశిస్సులే అవార్డులుగా అదే దీక్షతో ముందుకు సాగుతున్నాడీ పీపుల్స్ స్టార్.

ఉద్యమకారుడెప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి. అలా చూస్తే.. నారాయణమూర్తి నమ్మిన సిద్ధాంతం కోసం ఆచరిస్తోన్న జీవన విధానం ప్రపంచలో ఏ గొప్ప ఉద్యమకారుడికీ తీసిపోదు. వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి.. ఉన్నతమైన ఆశయాల వైపు పయనిస్తూ సినిమాలు చేస్తూ అందులోనే అన్ని ఆనందాల్ని అనుభవిస్తోన్న కర్మజీవి ఆయన.

కొన్నాళ్లుగా నారాయణమూర్తి నుంచి తరచూ సినిమాలు రావడం లేదు.. కారణం.. ఆర్థిక ఇబ్బందులు.. అయినా .. ఆ మధ్య టెంపర్ సినిమాలోని పోలీస్ పాత్ర కోసం బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అయినా ఇన్నేళ్లుగా తను నడుస్తున్న బాటను కేవలం డబ్బుకోసమే వీడను అని లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వచ్చే ఆఫర్ వదులుకున్నాడు. కాసుల కోసం నమ్మిన సిద్ధాంతాన్ని, ఆచరిస్తున్న మార్గాన్ని తాకట్టు పెడుతున్న ఉద్యమకారులున్న ఈ కాలంలో నారాయణమూర్తి లాంటి వ్యక్తి ఓ సినీ ఉద్యమ సూరీడే అని చెప్పాలి..

మల్టీనేషనల్ కంపెనీలకు అడవులను ధారాదత్తం చేస్తూ ఆదివాసీల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. దండకారణ్యం అనే సినిమా తెరకెక్కించారు. అయితే కంటెంట్ బావున్నా.. ఆయన టెక్నికల్ గా అప్డేట్ కాకపోవడం.. స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనం చూపకపోవడం వంటి కారణాలతో ఈ సినిమా కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది.

హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మూవీలో ఆయన సరసన జయసుధగారు హీరోయిన్ గా నటించడం విశేషం. తర్వాత అన్నదాతా సుఖీభవ అనే సినిమాతో వచ్చారు. బట్ .. మారుతున్న కాలానికి అనుగుణంగానే సినిమా కూడా చాలా మార్పులకు గురైంది. ఆ మార్పుల్లో నారాయణమూర్తి తరహా కథలకు చోటున్నా.. టెక్నికలన్ గా ఆయన అప్డేట్ కాకపోవడం వంటి అంశాల వల్ల ఆయన సినిమాలు ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోవడానికి కారణాల్లో ఒకటి. ఏదేమైనా తనదైన శైలిలో ఇన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని.. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలతో మనల్ని ఇన్ఫోటైన్ చేయాలని కోరుకుంటూ.. మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Next Story

RELATED STORIES