'ఓరేయ్ రిక్షా' వచ్చి పాతికేళ్లు.. ఈ చిత్రం ఓ సంచలనం

ఈ సినిమా సాధించిన విజయం కంటే సృష్టించిన సంచలనమే పెద్దది

ఓరేయ్ రిక్షా వచ్చి పాతికేళ్లు.. ఈ చిత్రం ఓ సంచలనం
X

ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న పరిశ్రమలో అన్నీ మరో ఏడాది వరకూ గుర్తుండటమే కష్టం. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నేళ్లైనా ఆడియన్స్ మనసుల్లోనుంచి అంత సులువుగా వెళ్లిపోవు. వాటినే మనం ఎవర్ గ్రీన్ సినిమాలంటాం. అలాంటి సినిమాల్లో పాతికేళ్ల క్రితం విడుదలైన ఒరేయ్ రిక్షా ఒకటి. సెన్సేషనల్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం కంటే సృష్టించిన సంచలనమే పెద్దది. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హీరోగా దాసరి డైరెక్షన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఒరేయ్ రిక్షా విడుదలై నేటికి 25యేళ్లు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ఓ సారి చూద్దాం..

ఓ నలభైయేళ్ల క్రితం.. ఒక కుర్రాడు దర్శకుడుగా వెలిగిపోతోన్న దాసరి వద్దకు వెళ్లాడు. ఇంకా చదువుకుంటోన్న ఆ కుర్రాడు దాసరిని వేషాలు అడిగాడు. కానీ డిగ్రీ అయిన తర్వాత రమ్మని చెప్పి పంపించాడు. చెప్పినట్టుగానే బుద్దిగా డిగ్రీ చదువుకుని మళ్లీ దాసరిని కలిశాడు. అతని కమిట్మెంట్ చూసి ముచ్చటేసింది. తను కొన్ని వేషా

లు ఇచ్చాడు. కానీ అవేవీ పెద్దగా గుర్తింపు తేలేదు. పైగా తను హీరో కావాలనుకున్నాడు. అందుకే సొంతంగా తనే సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఆ కుర్రాడే ఆర్ నారాయణమూర్తి. అలాంటి నారాయణమూర్తి కొన్నాళ్ల తర్వాత తన గురువు తనకే హిట్ ఇచ్చేంతగా ఎదుగుతాడని దాసరి కూడా ఊహించి ఉండడు.

నారాయణమూర్తి సొంతంగా బ్యానర్ స్థాపించి అర్థరాత్రి స్వతంత్రం, లాల్ సలామ్, దండోరా, ఎర్రసైన్యం అంటూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. అన్నీ విప్లవ పంథాలో సాగే సినిమాలే. చిత్రంగా ఆ టైమ్ లో దాసరి విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి దాసరి నారాయణమూర్తి ఇమేజ్ తోనే సినిమా చేయాలనుకున్నాడు. గురువే అడిగితే కాదంటాడా. అందుకే రెమ్యూనరేషన్ కూడా వద్దని ఆయనతో సినిమా కమిట్ అయ్యాడు నారాయణమూర్తి. ఒక రకంగా అప్పటికి నారాయణమూర్తి ఏ పెద్దస్టార్ కూ తీసిపోనంత విజయాలు సాధిస్తున్నాడు.

వీరి కాంబినేషన్ లో కార్మికులు, నాయకులు, ఎన్నికల నేపథ్యంలో మొదలైన సినిమా ఒరేయ్ రిక్షా. రవళి హీరోయిన్. రిక్షా యూనియన్ నాయకుడైన సూర్యం పాత్రలో నారాయణమూర్తి కనిపిస్తాడు. వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ఒక వ్యక్తి ముందుకు రావడం.. అతని మంచితనం చూసి సూర్యం తన వాళ్లందరితో ఓట్లు వేయించడం.. తర్వాత అతను ముసుగు తీసి ఫక్తు రాజకీయ నాయకుడులా సూర్యం ను మోసం చేస్తాడు. అతనికి సూర్యం ఎదురు తిరుగుతాడు. ఇటు పోలీస్ లు, రాజకీయ వ్యవస్థ కూడా వీరినే తప్పు పట్టడంతో విధిలేక వీటికి పరిష్కారం ఎర్రజెండానే అంటూ అడవి బాట పట్టి వాళ్లందరినీ అంతం చేయడం.. ఇదీ స్థూలంగా ఒరేయ్ రిక్షా కథ.

ఒరేయ్ రిక్షా నారాయణమూర్తి ఇమేజ్ కు తగ్గట్టుగానే సాగే సినిమా. దర్శకుడు దాసరి అయినా నాటి పీపుల్స్ స్టార్ ప్రభంజనానికి తలొంచక తప్పలేదు. అలాగని దాసరి మార్క్ లేదని కాదు. ఆయన రేంజ్ లో అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ప్రేమకథ ఉంది. సంఘర్షణ కనిపిస్తుంది. ఎటొచ్చీ ట్రీట్మెంట్ అంతా నారాయణమూర్తి ఇమేజ్ చుట్టే తిరుగుతుంది. సినిమా విజయానికి ఓ ప్రధాన కారణం అదే.

ఇక ఒరేయ్ రిక్షా అఖండ విజయం సాధించేలా చేయడంలో పాటలది ప్రథమ స్థానం. ఎనిమిది పాటలుంటే అన్నీ సూపర్ హిట్స్. వందేమాతరం శ్రీనివాస్.. దాసరి సినిమాకి సంగీతం అందించడం అదే ఫస్ట్ టైమ్. అతని టాలెంట్ నచ్చడం వల్లే ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మకు కూడా అతన్నే తీసుకున్నాడు. ఇక గద్దర్ అందించిన పాటలు నిప్పు కణికలై మండాయి. ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన నీ పాదం మీద పుట్టుమచ్చనై పాట నేటికీ ఎన్నో వేదికల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటకు గద్దర్ తో పాటు పాడిన వందేమాతరం శ్రీనివాస్ కు నంది అవార్డ్ వచ్చింది. కానీ గద్దర్ ఆ అవార్డ్ తీసుకోలేదు.

సినిమాలో బుర్రకథను సి. నారాయణరెడ్డి రాశారు. అలాగే జాగోరే అంటూ సాగే పాటను దాసరి రాయడం విశేషం. మిగిలిన పాటలన్నీ గద్దరే రాసినా.. టైటిల్స్ లో ఆయన పేరు ఉండదు. ఆయన అప్పుడు పీపుల్స్ వార్ పార్టీలో పనిచేస్తుండటం వల్లే తన పేరు వేయనీయలేదు. అలాగే ప్రభుత్వం ఇచ్చే అవార్డ్ నూ తీసుకోలేదు.

క్లబ్ డ్యాన్సర్ గా నేటి ఐటమ్ సాంగ్స్ తరహా పాటల్లో కనిపించిన అనూరాధకు దాసరి తన సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలు కూడా ఇస్తూ ఉంటారు. అలా ఈ సినిమాలో కూడా అవినీతి పోలీస్ ఆఫీసర్ గా ఆమెకు ఓ పాత్ర ఇచ్చాడు. తనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటుంది. అలాగే కన్నింగ్ పొలిటీషియన్ గా రఘునాథరెడ్డి తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. పార్టీ మీటింగ్ లో నారాయణమూర్తికి యూత్ లీడర్ పదవి ఇస్తాను అన్నప్పుడు వీరి మధ్య వచ్చే సీన్ నేటి యువతకూ వర్తిస్తుంది.

అలాగే పోలీస్ లు నారాయణమూర్తిపై నక్సలైట్ ముద్రవేసినప్పుడు వచ్చిన డైలాగ్స్ థియేటర్స్ ను దద్దరిల్లేలా చేశాయి. అలాగే ఆ తర్వాత వచ్చే రాజ్యాంగం రాజ్యాంగం అనే పాటకు పోలీస్ వర్గాల నుంచి విమర్శలు వచ్చినా.. ప్రజల నుంచి తిరుగులేని ప్రశంసలు వచ్చాయి. నాటి సామాజిక రాజకీయ పరిస్థితులకు దర్పణం పట్టిన ఎన్నో డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి.

ఒరేయ్ రిక్షా పరిమిత బడ్జెట్ లోనే రూపొందిన సినిమా. కథ, మాటలు, పాటలు ముక్కురాజు డ్యాన్సులు ప్రధాన ఆకర్షణగా వచ్చిన సినిమా. దాసరికి ఇది ఊహించని విజయాన్ని అందించింది. అప్పటి వరకూ నారాయణమూర్తి మాత్రమే చేస్తోన్న ఈ తరహా సినిమాలకు బి గోపాల్ వంటి వారూ రావడానికి కారణం దాసరే ఇలాంటి సినిమా చేసి విజయం సాధించాడనే నమ్మకం.

దాసరి శిష్యుడుగా పరిచయమైన నారాయణమూర్తి ఆ తర్వాత దాసరికే తిరుగులేని విజయాన్నిచ్చి రుణం తీర్చుకున్నాడు. నిజానికి ఒరేయ్ రిక్షా సాధించిన విజయమే దాసరిని ఒసేయ్ రాములమ్మా తీసేందుకు ధైర్యాన్నిచ్చింది. ఆయన కెరీర్ లో ఎన్నో మరపురాని విజయాలున్నా.. ఈ రెండు సినిమాలూ ప్రత్యేకంగా నిలవడం విశేషమే. ఏదేమైనా ఒరేయ్ రిక్షాలాంటి సినిమాలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వాల తీరును ఎండగట్టే బలమైన మాధ్యమంగా ఉన్నసినిమా ఇప్పుడు ఆ వైపే చూడ్డం లేదు. అలాంటి అరుదైన ప్రయత్నం చేసింది కనుకనే విడుదలై పాతికేళ్లవుతున్నా.. ఒరేయ్ రిక్షా నేటికీ ఎంతోమందికి ఇష్టమైన సినిమాగా నిలిచి ఉంది.

Next Story

RELATED STORIES