బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు..కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది మాత్రమే..

బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు..కరోనా నేపథ్యంలో అతికొద్ది మంది మాత్రమే..
X

శనివారం ఉదయం పదిన్నరకు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి.. తిరువళ్లూరు జిల్లా రెడ్‌ హిల్స్‌ సమీపంలోని తమరైపాక్కంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. అంతకు ముందు ఎంజీఎం ఆస్పత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని చెన్నై కోడంబాక్కంలోని ఎస్పీ చరణ్‌ నివాసానికి తరలించారు.. అభిమానుల సందర్శనార్థం కొద్ది సమయం అక్కడే ఉంచారు.. సినీ, రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చి బాలసుబ్రమణ్యం పార్థివ దేహానికి నివాళులర్పించారు.. కరోనా నిబంధనల నేపథ్యంలో శనివారం కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు అతికొద్ది మంది సమక్షంలో అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

కొంత కాలంగా శ్వాస సంబంధ వ్యాధితో ఇబ్బందిపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మరింత విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా 4 నిమిషాలకు తుది శ్వాసవిడిచారు. ఆయన్ను రక్షించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఎక్మోతో పాటు వెంటిలేటర్‌తో చికిత్స అందించినా ఉపయోగం లేకపోయింది. 40 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలసుబ్రమణ్యం చివరకు అలసి వెళ్లిపోయారు. బాలు మరణ వార్తతో సినీ, సంగీత అభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు.

ఆగస్టు 5న కరోనా సోకడంతో ఎస్పీ బాలు చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో గత కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రతిరోజూ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వచ్చారు.. తండ్రి ఆరోగ్య పరిస్థితిని కుమారుడు ఎస్పీ చరణ్ సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వివరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కొలుకున్నాక.. మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో తుదిశ్వాస విడిచారు. అందరిని ఇన్నేళ్లుగా తన పాటలతో అలరించిన బాలు... తిరిగి క్షేమంగా వస్తారనుంటున్న సమయంలో... ఆయన తుదిశ్వాస విడవటం అభిమానులకు కన్నీటి వ్యధను మిగిల్చింది.

Next Story

RELATED STORIES