HBD Nagarjuna : 'మన్మథుడు' నాగార్జున గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

HBD Nagarjuna : మన్మథుడు నాగార్జున గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చినా.. పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. తండ్రిలా రొమాంటిక్ హీరోగా అలరించాడు..

అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా వచ్చినా.. పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. తండ్రిలా రొమాంటిక్ హీరోగా అలరించాడు.. భక్తి చిత్రాల్లో సత్తా చాటాడు. తెలుగులో తనదైన పేజ్ రాసుకున్న హీరో. ఇమేజ్ కు భిన్నమైన కథలతో వహ్వా అనిపించాడు. కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఎంతో ప్రతిభను పరిశ్రమకు అందించాడు. ఆ నలుగురిలో ఒకడిగా.. ఇప్పటికీ యంగ్ స్టర్స్ కు పోటీ ఇస్తూ తన ఇమేజ్ కు తగ్గ సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగా, హోస్ట్ గానూ ఆకట్టుకుంటోన్న కింగ్ నాగార్జున పుట్టిన రోజు ఇవాళ.

నాగేశ్వరరావు గారి వారసుడిగా వచ్చిన నాగార్జున తొలినాళ్లలలో తడబడ్డాడు. దీంతోచాలామంది తండ్రి పేరు చెడగొతాడేమో.. అసలు హీరోగా నిలవలేడేమో అని అనుమానాలూ వ్యక్తం చేశారు. కానీ విమర్శలను స్వీకరించి.. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ మెల్లగా తండ్రి స్థానాన్ని భర్తీ చేశాడు. మొదట్లో విమర్శించిన వాళ్లే.. తర్వాత వాహ్ నాగ్ అనేలా చేశాడు. నాగ్ కెరీర్ దశాబ్ధానికో మలుపు తీసుకుని నడవడం విశేషం. నిర్మాతగానూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు అందించాడు. మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ కొత్త అధ్యాయం సృష్టించుకున్నాడు నాగ్.

హీరో అంటే పేజీల కొద్దీ డైలాగులు చెప్పడం.. ఇస్త్రీ నలక్కుండా పదిమందిని మడతబెట్టడం.. అదిరిపోయే స్టెప్పులేయడం అనే రొటీన్ ఫార్ములాకు చెక్ పెట్టిందీ కూడా నాగార్జునే. సైకిల్ చైను లాగి కూడా కొట్టొచ్చని.. అరుపులు, కేకలు లేకుండా సైలెంట్ గా విలన్ ని బెదిరించవచ్చని శివతో నిరూపించాడు. తెలుగు సినిమా గమనాన్ని ఉలిక్కిపడేలా చేసిన సినిమా శివ. దీని అసలు రూపకర్త రామ్ గోపాల్ వర్మ అయినా.. అతని ఆలోచిన ఆడియన్స్ వరకూ రావడానికి కారణం నాగార్జున నమ్మకం. అది లేకపోతే వర్మ లేడూ, శివా లేదు. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ అద్భుత సృష్టికి నాగార్జున పర్ఫార్మెన్స్ తోడై శివను ట్రెండ్ సెట్టింగ్ మూవీని చేశాయి.

కమర్షియల్ సినిమాలు చేసినప్పుడూ కాలిక్యులేషన్స్ ను దాటలేదు నాగ్. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, వారసుడు, అల్లరి అల్లుడు, హలోబ్రదర్, ఘరానాబుల్లోడు లాంటి ఊర మాస్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. హలో బ్రదర్ ఇప్పటికీ అన్నదమ్ముల కథకు కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంది. అలాగే ఇవన్నీ కమర్షియల్ సినిమాలే అయినా వీటిలో సిమిలారిటీస్ చాలా తక్కువ.

తెలుగులో నాగార్జున ఇమేజ్ కాస్త భిన్నం. క్లాస్ లో క్లాస్ గా మాస్ లో మాసివ్ గా కనిపిస్తాడు. వీటన్నిటికీ మించి ఏ సినిమా చేసినా అందులో తనదైన రొమాంటిక్ ట్యాగ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి నాగార్జున భక్తి సినిమాలో నటిస్తే.. ? అది కూడా రక్తి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో..? అందుకే వీరి కాంబినేషన్ లో అన్నమయ్య అనౌన్స్ అయినప్పుడు అన్నీ విమర్శలే వచ్చాయి. అన్ని విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పాడు నాగార్జున. అన్నమయ్యగా ఆ పాత్రకు ప్రాణం పోసి.. భక్తి పాత్రలు చేయడంలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు..

సంతోషం.. నాగార్జునను మన్మథుడిలా తెలుగు తెరకు చూపించిన సినిమా. తన సినిమాల ట్రెండ్ కు భిన్నంగా.. ఇమేజ్ కు కాస్త దూరంగా చేసిన ప్రయత్నం. అది కూడా ఓ కొత్త దర్శకుడిని నమ్మి.. మళ్లీ అతని నమ్మకం ఫలించింది. సంతోషం సూపర్ హిట్.. ఆ వెంటనే మన్మథుడు.. మరో సూపర్ హిట్. దీంతో నాగ్ కెరీర్ కొత్త టర్నింగిచ్చుకుంది.. కొత్త టర్న్ క్లాస్ అనిపించుకుంటే వెంటనే శివమణిలా మాస్ ను చూపించాడు. నా పేరు శివమణి.. నాక్కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగులు అమ్మాయిలకూ నచ్చాయి. తర్వాత నేనున్నాను, మాస్.. వరుస విజయాలు సాధించాయి.

అన్నమయ్య తర్వాత మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడు చేస్తారని ఎప్పుడూ అడిగేవారు నాగ్ ను. దీనికి సమాధానం రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. మళ్లీ రాఘవేంద్రరావు కాంబినేషనే. కానీ ఈ సారి ఎవరికీ డౌట్స్ లేవు. అంచనాలకు తగ్గట్టుగా శ్రీరామదాసు సూపర్ హిట్. నాగార్జున నటనా హైలెట్.. అలాగే చాన్నాళ్ల తర్వాత తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాంబినేషన్ పరంగానూ ఆకట్టుకున్న రామదాసుకు ప్రేక్షకులు విజయరథం పట్టారు. కాకపోతే ఇదే కాంబోలో భక్తి మార్గంలో వచ్చిన శిరిడీ సాయి, నమోవేంకటేశాయ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

కొన్ని వరుస ఇబ్బందుల తర్వాత మనం అంటూ కుటుంబమంతా కలిసి నటించేలా మరో ఎక్స్ పర్మంటల్ మూవీ చేశాడు. అలాగని అదేదో తమ కోసం తీస్తున్నది కాదు.. కథనే నమ్మి నాగ్ చేసిన ప్రయత్నం. కానీ అంతలోనే దుర్వార్త. నాగేశ్వరరావు గారికి క్యాన్సర్. అయినా బాధను దిగమింగుకుని కుటుంబమంతా కలిసి చేసిన మనం.. సూపర్ హిట్ అయింది. ఈ మాట స్వయంగా వినేందుకు నాగేశ్వరరావు గారు లేరు. కాకపోతే చివరి క్షణం వరకూ నటించాలన్న ఆయన కోరిక మాత్రం తీరింది.

Tags

Read MoreRead Less
Next Story