అప్పటి వరకు అలానే.. లాక్డౌన్‌లో తెలిసొచ్చింది: నటి ఝాన్సీ

అప్పటి వరకు అలానే.. లాక్డౌన్‌లో తెలిసొచ్చింది: నటి ఝాన్సీ

బుల్లి తెర యాంకర్లంటే మొదట గుర్తొచ్చే పేర్లు ఝాన్సీ, సుమ, ఉదయభాను.. ఇప్పుడు చాలా మంది తెర మీద కనిపిస్తున్నా కొందరు మాత్రమే అలా గుర్తుండిపోతారు. ముఖ్యంగా ఝాన్సీ యాంకర్‌గానే కాదు, నటిగా, రంగస్థల కళాకారిణిగా, సామాజిక సమస్యలపై స్పందించే ఓ మహిళగా మంచి పేరు తెచ్చుకున్నారు. పురుషాధిక్య సమాజంలో ఒంటరి మహిళగా సమస్యలెన్ని ఎదురైనా సామరస్యంగా పరిష్కరించుకుంటూ తన కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నారు.

తాజాగా కోవిడ్ నేపథ్యంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. జీవితం పట్ల తన దృక్పథాన్ని మార్చిన ఘనత కోవిడ్‌కే దక్కుతుందని అన్నారు. కరోనా తనకు అనేక గుణపాఠాలు నేర్పిందని తెలిపారు. అవసరానికి మించి దాచుకోవాలనే ఆలోచనను కోవిడ్ చెరిపేసిందని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో తన దగ్గర వాడకుండా కేవలం దాచుకున్న చీరల్లో చాలా వాటిని మిత్రులకు, తెలిసిన వారికి బహుమతిగా ఇచ్చినట్లు ఝాన్సీ తెలిపారు. అలా బీరువాలో ఉన్న 300 చీరలను సన్నిహితులు, స్నేహితులు, సహచరులకు బహుమతిగా ఇచ్చినట్లు ఆమె వివరించారు. తనకు అత్యంత ప్రియమైన వారు ఇచ్చినవి, తాను సొంతగా నేయించుకున్న చీరలను మాత్రమే తన దగ్గర ఉంచుకున్నానని తెలిపారు. అలా అన్నీ అందరికీ ఇచ్చేసిన తరువాత మనసు ప్రశాంతంగా అనిపించిందన్నారు.

ఈ సందర్భంగా జపాన్‌కు చెందిన మేరీ కాండో అనే తత్వవేత్త ప్రతిపాదించిన 'మినిమలిస్టిక్' ఫిలాసఫీ గుర్తొచ్చిందన్నారు. అదనపు భారాన్ని ఎప్పటికప్పుడు దించేసుకోవాలన్నదే ఈ ఫిలాసఫీ ముఖ్య ఉద్దేశం. అత్యంత సన్నిహితులైన మనవారి మరణం మనల్ని చాలా బాధపెడుతుంది. పిన్ని కరోనాతో మరణించడంతో చాలా రోజులు ఆ బాధ నుంచి బయటపడలేకపోయానని అన్నారు. కోవిడ్ వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని ఝాన్సీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story