'దానవీరశూరకర్ణ'లో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?

దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా?
పౌరాణిక చిత్రాలంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు.. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది.

పౌరాణిక చిత్రాలంటే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు.. రాముడైనా, రావణుడైనా నటించి మెప్పించగల సత్తా ఆయనకే చెల్లింది. ఓ పక్కా కమర్షియల్‌‌‌‌గా సినిమాలు చేస్తూనే.. మరోపక్కా పౌరాణిక చిత్రాలను చేస్తుండేవారాయన. అందులో భాగంగా వచ్చిన చిత్రమే దానవీరశూరకర్ణ.. ఎన్టీఆర్ నటవిశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ ఫలితమనే చెప్పాలి. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని హీరోగా, ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించారు. ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రం.

కేవలం 10 లక్షలతో నిర్మించబడిన ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల ఈ సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్టీఆర్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటారు. ఈ సినిమాలో అర్జునునిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యునిగా నందమూరి బాలకృష్ణ నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ తాతమ్మకల చిత్రంలోనూ, రామ్ రహీమ్ లోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు.

బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించిన చివరి చిత్రం ఇదే. ఈ సినిమాకి మాటల రచయితగా కొండవీటి వెంకటకవిని తీసుకున్నారు ఎన్టీఆర్. అంతకుముందు ఆయన గుంటూరులోని ఓ సంస్కృత శకళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఆయనకి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇందులో ఆయన రాసిన"ఆచార్య దేవ.. ఏమంటివి ఏమంటివి.. ఇది క్షాత్ర పరిక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే.. కాదు.. కాకూడదు"అనే డైలాగ్ ఇప్పటికి ఫేమస్ అనే చెప్పాలి. ఇదిలావుండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తే.. సీనియర్ నటుడు చలపతిరావు ఏకంగా అయిదు పాత్రలో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర కాగా మిగిలినవి రెండు అతిథి పాత్రలు.

Tags

Read MoreRead Less
Next Story