DRUGS CASE: డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ విచారణ

DRUGS CASE: డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ విచారణ

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌లో డ్రగ్స్‌ కేసులో తీగలాగుతుంటే డొంక కదలుతోంది. డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్‌ను యాంటీ నారొటిక్స్‌ బ్యూరో విచారించిందివిచారణకు . శనివారం ఉదయం 11 గంటల నుంచి నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం సాయంత్రం 5 గంటల వరకు విచారించింది. ఈ కేసులో పట్టుబడిన వైజాగ్‌కు చెందిన రాంచంద్‌ ద్వారా మత్తుపదార్ధాలను నవదీప్ కోనుగోలు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుల జాబితాలో చేర్చారు.


నవదీప్‌ తన సెల్‌ఫోన్‌ను తీసుకురాకపోవడంతో టీన్యాబ్‌ అధికారులు ఫోన్‌ను తెప్పించారు. మొబైల్‌ను ఫార్మాట్‌ చేసి సోషల్‌ మీడియా, గ్యాలరీసహా డాటా మొత్తం డిలీట్‌ చేసినట్టు గుర్తించారు. ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి, డాటా రిట్రీవ్‌ చేయించనున్నారు. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని నవదీప్‌ను ఆదేశించారు. ‘డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌ అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’లోని డ్రగ్స్‌ సప్లయర్లు, కస్టమర్లుగా ఉన్న 81 మందితో నవదీప్‌ కాంటాక్ట్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈనెల14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా మరో 8 మందిని అరెస్ట్‌ చేశారు. నటుడు నవదీప్‌ వారి వద్ద డ్రగ్స్ కోనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పాన్‌ఇండియా తరహాలో TSన్యాబ్‌ డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోందని నటుడు నవదీప్‌ అన్నారు. మత్తుపదార్ధాల కేసులో పారిపోయానంటూ మాధ్యమాల ద్వారా వచ్చినవి పుకార్లు మాత్రమేనని సృష్టం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చినట్లు తెలిపారు. కేసుతో తనకెలాంటి సంబంధం లేదని, నోటీసులిస్తే వచ్చానని వివరించారు. గతంలో పబ్‌ నిర్వహించినపుడు సిట్, ED దర్యాప్తునకు హాజరయ్యానని, అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడు నార్కొటిక్‌ పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.


మాదాపూర్‌ డ్రగ్స్‌కేసులో నవదీప్‌ను సుదీర్ఘంగా విచారించినట్లు టీఎస్‌న్యాబ్‌ SPసునీతారెడ్డి తెలిపారు. కేసులో 81 లింకులను గుర్తించామని, వాటిలో నవదీప్‌ 41 లింకుల వివరాలు అందించినట్లు వెల్లడించారు. సిట్, ఈడీ విచారణ ఎదుట డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు. ఫోన్లలోని డేటాను నవదీప్‌ పూర్తిగా తొలగించాడని ఆ సమాచారం తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తామని సునీతారెడ్డి వివరించారు. ఈ కేసులో పట్టుబడ్డ డ్రగ్‌ వినియోగదారుడు కొల్లి రామ్‌చంద్‌తో 15 ఏళ్లుగా పరిచయం ఉన్నట్టు నవదీప్‌ అంగీకరించినట్టు చెప్పారు. అమెరికాకు వెళ్లిన సమయంలో అక్కడ లభించే గమ్మీస్‌ తీసుకునేవాడినని నవదీప్‌ తెలిపాడని, ఇందులో స్థానిక చట్టాలకు అనుగుణంగా డ్రగ్స్‌ మోతాదు ఉంటుందని తెలిపారు.

Next Story