HBD sobhan babu : శోభన్ బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

HBD sobhan babu : శోభన్ బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు.

తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి విశేషణాలు శోభన్ బాబుకు తప్ప మరే నటుడి గురించి వినబడలేదు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా...డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారాయన. ఎక్కడ మొదలు పెట్టాలో... ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. వెండితెర అభిమన్యుడు శోభన్ బాబు జయంతి సందర్భంగా ఒక్కసారి అందమైన జ్నాపకాల్లోకి వెళ్దాం.

శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది దైవబలం అనే జానపద చిత్రంతో. ఎన్.టి.ఆర్ హీరోగా చేసిన దైవబలంలో శోభన్ బాబు ఓ చిన్న పాత్ర ధరించారు. శోభన్ స్క్రీన్ మీదకు వచ్చిన టైమ్ లో జానపదాలు, పౌరాణికాల రాజ్యం నడుస్తోంది. ఆ తర్వాత అన్నగారి పౌరాణిక చిత్ర రాజం లవకుశలో రామానుజుడుగా నటించి మెప్పించారు. శోభన్ బాబు డైరక్టర్స్ హీరో. ఆయన కెరీర్ లో ప్రధానంగా నలుగురైదుగురు డైరక్టర్లు కనిపిస్తారు. కె.ఎస్ ప్రకాశరావు, కె.విశ్వనాథ్, బాపు, వి.మధుసూధనరావు, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు. వీళ్లందరూ శోభన్ బాబు కెరీర్ లో టాప్ మూవీస్ అని చెప్పుకునే సినిమాలు తీశారు. తనలోని నటుడ్ని పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

విశ్వనాథ్ కెరీర్ లో శోభన్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. ప్రైవేటు మాస్టారు చిత్రంతో ప్రారంభమైన వీరిద్దరి ప్రయాణం నిండు హృదయాలు, చిన్న నాటి స్నేహితులు, శారద, జీవనజ్యోతి, జీవిత నౌక, కాలాంతకులు, చెల్లెలి కాపురం ఇలా కొనసాగింది. శోభన్ బాబు గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు. డీ గ్లామర్ రోల్స్ నూ అద్భుతంగా చేసి మెప్పించగలడని నిరూపించిన చెల్లెలి కాపురం విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నదే.

శోభన్ బాబు తో ప్రత్యేక అనుబంధం ఉన్న మరో దర్శకుడు దాసరి నారాయణరావు. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బలిపీఠం. చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబును తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మలి చిత్రం గోరింటాకు. తర్వాత స్వయంవరం వంటి మెమరబుల్ మూవీస్ మరెన్నో వచ్చాయ్..

శోభన్ బాబుతో అన్ని రకాల పాత్రలూ చేసి మెప్పించిన హీరోయిన్ శారద. శోభన్, శారదలది హిట్ పెయిర్ అనేవారు. కాంచన, చంద్రకళ, లక్ష్మీ లాంటి ఆనాటి గ్లామర్ హీరోయిన్స్ కు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్నారు. ఇక ఆయనతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. సోగ్గాడుతో మొదలైన ఈ జోడీ.. కోడి రామకృష్ణ తీసిన ఆస్తి మూరెడు, ఆశబారెడు వరకూ కంటిన్యూ అయ్యింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మల్లెపూవు, మండే గుండెలు, ఇల్లాలు లాంటి సూపర్ హిట్స్ చాలానే ఉన్నాయి.


ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన శోభన్ బాబు ఎప్పటికి ప్రేక్షకులు మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించి తన 59వ ఏట నటజీవితానికి స్వస్తి చెప్పారు. 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో..గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవారు. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కాదు.. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నైలో మరణించారు. అయన మన మధ్య భౌతికంగా లేకున్నా ఎప్పటికి సినిమాల ద్వారా ఎప్పటికి ప్రేక్షకుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోతారు.

Tags

Read MoreRead Less
Next Story