శ్రీకాంత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!

శ్రీకాంత్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా!
ఆ చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ ను ఎంపిక చేసాడు.

ఏ నటుడైనా చాలా చిన్న పాత్రలతో పరిచయమై.. విలన్ గా మెప్పించి.. ఆ తర్వాత హీరోగా రాణించి.. ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో శెభాష్ అనిపించుకుని సెంచరీ కొట్టడం ఆషామాషీ విషయం కాదు. శతాధిక చిత్ర నటుడుగా ఆ ఘనత సాధించాడు శ్రీకాంత్. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని స్వయంకృషితో ఎదిగి తనూ ఎంతోమందికి ఆదర్శం అయ్యాడు శ్రీకాంత్. శ్రీకాంత్ లాంటి కెరీర్ స్పాన్ ఉన్న మరో నటుడ్ని చూస్తామో లేదో కానీ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ ఆకట్టుకుంటోన్న శ్రీకాంత్ బర్త్ డే ఇవాళ (March 23).

ఆ రోజుల్లో అందరు కుర్రాళ్లలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి అభిమాని. ఆయన డ్యాన్సులు చూసి చిన్నప్పటి నుంచే సినిమా నటుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషాకిరణ్ మూవీ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ ను ఎంపిక చేసాడు. ఆ విదంగా 'పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.

వెంటనే 'మధురానగరిలో' లో హీరోగా ఆవకాశం రావటంతో ఆ తరవాత కూడా హీరో అవకాశాలువస్తాయేమో అని ఎదురు చూసాడు. కాని రాలేదు. అదే సమయంలో ఇ.వి.వి. సత్యనారాయణ విలన్ గా నటించమని కోరడంతో 'వారసుడు' సినిమాలో నటించాడు. ఆ తరవాత దాదాపు 13 సినిమాలలో విలన్ గా నటించాడు. విలన్ గా ప్రత్యేక ముద్ర వేయలేదు కానీ.. నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.

ఫైనల్ గా వన్ బై టూ చిత్రంతో మళ్లీ హీరోగా అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తాజ్ మహల్ మంచి విజయం సాధించి శ్రీకాంత్ ను హీరోగా నిలబెట్టింది. హీరోగా శ్రీకాంత్ తొలి హిట్ తాజ్ మహల్ అనే చెప్పాలి. అయితే ఊహ తో చేసిన ఆమె సినిమా.. ఆ తర్వాత, అతని జీవితంలోకీ ఆమెను తీసుకువచ్చేసింది.


ఇండస్ట్రీలో బ్రేక్ ఇంపార్టెంట్. అది రావడానికి కొంత టైమ్ పట్టినా శ్రీకాంత్ ను హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు రాఘవేంద్రరావు. పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్ కు గొప్ప బ్రేక్ ఇచ్చాడు. దీని తర్వాత తను ఎలా ఉంటే ఆడియన్స్ కు ఇష్టం అన్న విషయం కూడా శ్రీకాంత్ అర్థమైంది. అందుకే ఆ తర్వాత ఈ తరహా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలకే ఫిక్స్ అయిపోయి.. సూపర్ సక్సెస్ అయ్యాడు..

పెళ్లి సందడి సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. కాంపీటీషన్ గా ఉన్నా.. తనదైన ప్రత్యేకత చూపించాడు. ముఖ్యంగా ఇవివి సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దర్శకులు శ్రీకాంత్ ను బాగా ఎంకరేజ్ చేశాడు.మొత్తంగా శ్రీకాంత్ తో సినిమా అంటే సేఫ్ ప్రాజెక్ట్ అని నిర్మాతలు, శ్రీకాంత్ సినిమా అంటే చూడాల్సిందే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.

ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ చట్రంలోనే ఆగిపోలేదు. ట్రెండ్ ను బట్టి కథలు మార్చాడు.. ఇమేజ్ ను కాదనుకునీ వెళ్లాడు.అలా చేసినవే చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, తిరుమల తిరుపతి వెంకటేశా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సినిమాలు. ఆయా ట్రెండ్స్ ను బట్టి శ్రీకాంత్ సెలెక్ట్ చేసుకున్న సినిమాలని చెప్పొచ్చు.

వేగంగా సినిమాలు చేయడం వల్లేమో శ్రీకాంత్ ఎంచుకునే సబ్జెక్ట్స్ మొనాటనీగా మారాయి. దీంతో ఫ్లాపులు వచ్చాయి. ఏ సినిమా కూడా ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఆడలేదు. ఈ టైమ్ లో కృష్ణ వంశీ ఖడ్గం శ్రీకాంత్ లోని కొత్త యాంగిల్ ను చూపించింది. ప్రేయసిని పోగొట్టుకున్న అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ నటనకు ఫిదా కాని వారు లేరు. ఈ సినిమా తర్వాత అతని కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుంది.


హిట్లూ, ఫ్లాపులూ పక్కనబెడితే శ్రీకాంత్ మంచి ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో అతనిలోని అద్భుతమైన నటుడ్ని చూశాం. వ్యక్తిగానూ ఎవరి విషయంలోనూ టంగ్ స్లిప్ కావడం అనేది శ్రీకాంత్ లైఫ్ లో లేదు. తొలినాళ్లలో ఎలా ఉన్నా శ్రీకాంత్ అంటే వివాదరహితుడు.. నటుడుగా తేడా వచ్చిన ప్రతిసారీ ప్రయోగం చేశాడు. అతను వైవిధ్యమైన ప్రయత్నాలు చేసిన ప్రతిసారీ ఆడియన్స్ ఆదరించారు. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మా అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.

శ్రీకాంత్ లోని యాంగ్రీనెస్ ను ఆడియన్స్ కు చూపించిన కృష్ణవంశీ అతని వందో సినిమాకోసం మరో వైవిధ్యమైన కథతో వచ్చాడు. మహాత్మ సినిమాలో వీధి రౌడీ నుంచి మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని ఆ బాటలో సాగాలనుకునే యువకుడి పాత్రలో అతని నటన అసామాన్యం.

ప్రస్తుతం తనకు నచ్చిన, తనకోసం వచ్చిన కథల్లో హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటిస్తున్నాడు. రాబోయే రోజుల్లోనూ విలన్ గా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ ఆకట్టుకుంటున్నాడు. సో హీరో అనే కాకుండా మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగాలని కోరుకుంటూ మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్ కు మరోసారి బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.


Tags

Read MoreRead Less
Next Story