15 అడుగుల గిరి నాగు.. ఇది కాని కాటేస్తే..

15 అడుగుల గిరి నాగు.. ఇది కాని కాటేస్తే..
గిరినాగులు సాధారణంగా జనావాసాల్లోకి రావు. విషం ఉండే పాములను, విషం లేని పాములను ఆహారంగా తీసుకుంటాయి.

పామును చూస్తేనే అమ్మో అంటారు. అలాంటిది పదడుగులకు పైగా ఉండే గిరినాగును చూస్తే బాప్ రే అని భయపడి పరిగెడతారు. విశాఖజిల్లా బేతపూడి సమీపంలోని రైవాడ ఎడమ కాలువ గట్టు తుప్పల్లో ఈ పాము కనిపించింది. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు పాములు పట్టే నిపుణులను సంప్రదించారు. నలుగురు నిపుణులను రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు వెదికినా ఆ పాము ఆచూకీ దొరకలేదు. పైగా అక్కడున్న కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఆ కాలువకు అవతలి వైపు ఉన్న గట్టు తుప్పల్లోకి పాము వెళ్లిపోయి ఉంటుందని అక్కడున్నవారంతా నిర్థారణకు వచ్చారు. ఇది సరే.. మరి ఆ పాము సంగతేంటి? అక్కడున్న వారి పరిస్థితి ఏమిటి? తనను ఎవరైనా వేటాడుతున్నారని తెలిస్తే.. గిరి నాగు పాములు ఎలా స్పందిస్తాయి? ఇలా చాలా ప్రశ్నలు వస్తాయి. నిజానికి గిరి నాగుల గురించి ఒక్కో విషయం తెలుసుకుంటున్నకొద్దీ ఆసక్తి పెరుగుతుంది.

గిరినాగులు సాధారణంగా జనావాసాల్లోకి రావు. అవి ఎక్కువగా దట్టమైన అరణ్యాల్లోనే సంచరిస్తాయి. వీటికి చాలా విషం ఉంటుంది. ఇవి బాగా విషం ఉండే పాములను, విషం లేని పాములను ఆహారంగా తీసుకుంటాయి. అంటే పాముల సంఖ్య విపరీతంగా పెరిగిపోకుండా ఓరకంగా గిరినాగులు మనకు సాయం చేస్తున్నట్టే. ప్రకృతిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నట్టే. ఇవి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈమధ్య ఇవి జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. కొద్ది నెలల కిందట తెనుగుపూడి అటవీ ప్రాంతంలో ఐదు గిరి నాగులు కనిపించాయి. వాటిలో ఓ గిరినాగును స్థానికులే ప్రాణభయంతో చంపేశారు. కానీ మిగిలిన పాముల విషయంలో మాత్రం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ ప్రతినిధులు కాపాడారు.

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించిన తూర్పు కనుమల్లోని అటవీ ప్రాంతంలో గిరినాగులు ఎక్కువగా కనిపిస్తాయి. విశాఖజిల్లాలోని దేవరాపల్లి, చీడికాడ మండలాలతో పాటు అనంతగిరి, హుకుంపేట మండలాల్లో విస్తరించి ఉన్న దాదాపు 10 వేల హెక్టార్ల తెనుగుపూడి అటవీ ప్రాంతం గిరినాగులకు ఆవాసంగా మారింది. ఇవి సాధారణంగా 10 నుంచి 14 అడుగులు ఉంటాయి. కొన్ని చోట్ల 20 అడుగుల గిరినాగులు కూడా కనిపిస్తాయి.

మగ, ఆడ గిరినాగులు.. ఏడాదిలో నాలుగు నెలల పాటు అంటే మార్చి నుంచి జూన్ నెలల మధ్య సంగమిస్తాయి. మగ గిరి నాగులను ఆకర్షించడానికి గిరి నాగులు ప్రయత్నిస్తాయి. దీనికోసం ఆడ గిరినాగు.. ఫెరామోన్స్ అనే ఒక విధమైన రసాయనాన్ని తన శరీరం నుంచి వెదజల్లుతుంది. ఆ వాసనే మగ గిరి నాగులను అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఆ వాసన వచ్చిన చోటుకు అవి వెదుక్కుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో ఆడ పాములను అనుసరిస్తాయి. వేసవి కాలంలో అడవుల్లో కాని నీటి వనరులు తగ్గిపోతే అవి నీటి కోసం చెమ్మను వెదుక్కుంటూ పొలాల్లోకి వచ్చేస్తాయి.

సాగు కాలంలో రబీ సీజన్ చాలా ముఖ్యం. ఆ కాలంలో నాగుపాములు, కట్లపాము, రక్తపొడ.. ఇంకా ఇతరత్రా విష పూరిత పాములు పొలాల్లో తిరుగుతుంటాయి. జెర్రిగొడ్డు వంటి విషరహిత పాములు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడానికి గిరినాగులు అక్కడికి వచ్చేస్తాయి. అందుకే ఆ సీజన్ లో వాటికి ప్రాణగండం పొంచి ఉంటుంది. గిరినాగు చాలా అరుదైన సర్ప జాతికి చెందిన పాము. ఇది కాటేస్తే పది నిమిషాల్లోనే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అందుకే అవి కనిపించగానే చంపేస్తున్నారు. కానీ వాటిని చంపకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఆ జాతిని రక్షించినట్లు అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story