Kempe Gowda Farmer: రైతునే అవమానించిన సేల్స్‌మ్యాన్.. గంటలో రూ. 10 లక్షలతో..

Kempe Gowda Farmer: రైతునే అవమానించిన సేల్స్‌మ్యాన్.. గంటలో రూ. 10 లక్షలతో..
Kempe Gowda Farmer: బొలెరో కోసం ఓ షోరూమ్‌కు వెళ్లాడు కెంపెగౌడ. కానీ అక్కడ సేల్స్‌మ్యాన్ కెంపెగౌడను అవమానించాడు.

Kempe Gowda Farmer: ఒక్క పాటలో కోటీశ్వరుడు అయిపోవడం.. విలన్‌కు ఛాలెంజ్ విసిరిన హీరో ఉన్నట్టుండి డబ్బులు సంపాదించడం.. ఇవన్నీ మనం ఇప్పటివరకు చాలా సినిమాల్లో చూసుంటాం. అవి సినిమాలు కాబట్టే అదంతా సాధ్యం అని కూడా అనుకొని ఉంటాం. కానీ నిజజీవితంలో కూడా అలా జరిగే అవకాశం ఉందా..? నిజమే.. అలా ఒకరి జీవితంలో జరిగింది. అదే కర్ణాటకకు చెందిన కెంపెగౌడ అనే రైతు జీవితంలో.

కారు కొనాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలి అన్నట్టుగా మాట్లాడతారు చాలామంది. కానీ కొనాలనే సంకల్పం ఉంటే అనుకున్నది సాధించవచ్చు అని మరోసారి నిరూపించాడు కెంపెగౌడ అనే రైతు. బొలెరో పికప్‌ ట్రక్‌ కోసం ఓ షోరూమ్‌కు వెళ్లాడు కెంపెగౌడ. కానీ అక్కడ సేల్స్‌మ్యాన్ కెంపెగౌడను ఘోరంగా అవమానించాడు. దీని వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది.

కారు ధర ఎంత అని కెంపెగౌడ అడగగా దాని ధర రూ.10 లక్షలని, అది కొనడానికి 'నీ దగ్గర రూ.10 రూపాయలు అయినా ఉన్నాయా' అంటూ ఆ సేల్స్‌మ్యాన్ అవమానంగా మాట్లాడాడు. కెంపెగౌడ దీనిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని గంటలో రూ.10 లక్షలతో మళ్లీ షోరూమ్‌లోకి అడుగుపెట్టాడు. అది చూసి సేల్స్‌మ్యాన్ ఆశ్చర్యపోయాడు. అప్పటికీ అతడి ప్రవర్తన మారలేదు.

సేల్స్‌మ్యాన్ ప్రవర్తన నచ్చని కెంపెగౌడ అతడిని క్షమాపణలు చెప్పాలని అన్నాడు. కానీ సేల్స్‌మ్యాన్ అలా చేయలేదు. దీంతో ఆ షోరూమ్ ఉద్యోగులకు, కెంపెగౌడ మనుషులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వారి రాకతో ఆ సేల్స్‌మ్యాన్ కెంపెగౌడకు క్షమాపణలు చెప్పాడు. ఆ షోరూమ్‌లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story