PUBG LOVE: గూఢచారిని కాదు.. ప్రేమికురాలిని

PUBG LOVE: గూఢచారిని కాదు.. ప్రేమికురాలిని
ప్రేమికుడి కోసం పాక్‌ నుంచి వచ్చిన మహిళ అరెస్ట్‌.... నలుగురు పిల్లలతో కలిసి జైల్లో ఉండేందుకు కోర్టు అనుమతి.... తాను గూఢచారిని కాదు, ప్రేమికురాలినన్న సీమ..

పబ్‌ జీ ఆటలో పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన మహిళకు కోర్టు 14 రోజుల జ్యుడిషీయల్‌ కస్టడీ విధించింది. ఆమెతోపాటు సరిహద్దు దాటిన నలుగురు సంతానం కూడా జైల్లో ఉండేందుకు అనుమతించింది. నోయిడాలోని రబూపురకు చెందిన సచిన్‌ ఆన్‌లైన్‌ పబ్‌జీకి బానిసయ్యాడు. అలా ఆడే క్రమంలో పాకిస్థాన్‌ మహిళ సీమ గులాం హైదర్‌తో పరిచయమైంది. అనంతరం వీరిద్దరూ తరచూ మాట్లాడుకునే వాళ్లు. ఆ చనువు కాస్తా ప్రేమగా మారింది. ఇక ప్రేమికుడి విరహం భరించలేక మే 13న ఆ పాకిస్థాన్ మహిళ ఇల్లు వదిలి నలుగురు పిల్లల్ని తీసుకుని బార్డర్ దాటి ఇండియాకు వచ్చేసింది. సచిన్‌ తండ్రికి కూడా ఈ విషయమంతా తెలుసని, అందుకే అతన్ని కూడా రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


సీమా తన నలుగురు సంతానంతో కలిసి పర్యాటక వీసాపై నేపాల్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంపాటు తన పిల్లలతో కలిసి పొఖారాలోనే ఉంది. మార్చి నెలలో సచిన్‌ కూడా నేపాల్‌ వెళ్లి సీమాను కలిశాడు. వారం రోజులపాటు ఆమెతోనే ఉన్నట్లు పోలీసులు చెప్పారు.పెళ్లి చేసుకొని భారత్‌లోనే ఉండాలనే ఈ ప్రేమ జంట నిర్ణయానికి వచ్చింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదన్న ఉద్దేశంతో సచిన్‌ తిరిగి వచ్చిన కొన్నిరోజుల తర్వాత సీమా ప్రియుడి వద్దకు వచ్చింది. కాఠ్‌మండూ మీదుగా బస్సులో దిల్లీ చేరుకున్న ఆమె అక్కడి నుంచి గ్రేటర్‌ నొయిడాలో ఉన్న సచిన్‌ వద్ద వెళ్లింది. సీమను పెళ్లి చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్న సచిన్‌ అప్పటివరకు ఆమెను వేరేగా అద్దె ఇంట్లో ఉంచాడు. అక్కడే ఆమె పాకిస్థాన్‌ జాతీయురాలనే విషయం బయటపడింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఈ జంట అక్కడి నుంచి పరారైంది. హరియాణాలోని వల్లభ్‌గఢ్‌లో ఉండగా వీరిని ట్రేస్‌ చేసి పట్టుకున్నారు.

పాకిస్థాన్‌ మహిళ సీమాపై విదేశీ చట్టం, పాసుపోర్ట్‌ చట్టం, భారత శిక్షాస్మృతి 120బీ, 34సహా వివిధ సెక్షన్ల కింద రబుపురా ఠాణాలో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. నిందితురాలి నుంచి వివాహ ధ్రువపత్రం, పాకిస్థాన్‌ పౌరసత్వం కార్డు, సిమ్ కార్డ్‌, చరవాణి, మొత్తం ఐదు పాస్‌పోర్టులు, వివాహానికి సంబంధించిన 2వీడియో క్యాసెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2019-20లో పబ్ జీ ఆడుతుండగా వీరిద్దరి పరిచయం ఏర్పడినట్లు విచారణలో సచిన్‌, సీమ ఒప్పుకున్నారుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారుని పోలీసులు తెలిపారు.

పాకిస్థాన్‌ సింధ్‌ ప్రావిన్స్‌ కు చెందిన సీమాకు 2014లో గులాం హైదర్‌తో వివాహం జరిగింది. 2019లో పని నిమిత్తం గులాం హైదర్‌ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. ఆ సమయంలో పబ్‌ జీ వీడియో గేమ్‌ ఆడుతున్న సీమాకు సచిన్‌తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరూ వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చాటింగ్, కాల్స్‌ చేసుకున్నట్లు చెప్పారు. 30ఏళ్ల సీమా, 25ఏళ్ల సచిన్‌ మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగి కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. తాను గూఢచారిని కాదని.. ప్రేమికురాలిని మాత్రమే అని సీమా పోలీసులకు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story