టిక్‌టాక్ యాప్ నిర్వహిస్తున్న బైట్‌డాన్స్ కీలక నిర్ణయం

టిక్‌టాక్ యాప్ నిర్వహిస్తున్న బైట్‌డాన్స్ కీలక నిర్ణయం
2వేల మంది ఉద్యోగులను పోషించడం కుదరదంటూ టిక్ టాక్ సంస్థ.. తన ఉద్యోగులందరినీ లేఖలు రాసింది.

భారత్‌లో టిక్ టాక్ వీడియో యాప్ శాశ్వతంగా మూతపడనుంది. టిక్‌టాక్ వీడియో యాప్ నిర్వహిస్తున్న బైట్‌డాన్స్.. కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న 2వేల మంది ఉద్యోగులను తీసువేస్తున్నట్లు బైట్‌డాన్స్.. వారికి లేఖలు పంపింది. భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఉన్న నేపథ్యంలో.. కంపెనీ ఉద్యోగుల పరిమాణాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొంది. దీని వల్ల భారత్‌లో ఉన్న 2వేల మంది బైట్‌డాన్స్ ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.

గతకొంత కాలంగా ఇండియాలో ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా 2వేల మంది ఉద్యోగులను పోషించడం కుదరదంటూ టిక్ టాక్ సంస్థ.. తన ఉద్యోగులందరినీ లేఖలు రాసింది. దేశంలో టిక్ టాక్ శాశ్వతంగా నిషేధానికి గురికావడంతో చేసేది లేక.. తాజాగా ఈ నిర్ణయం తీసుకునట్లు బైట్‌డాన్స్ సంస్థ వెల్లడించింది. టిక్ టాక్ తో పాటు నిషేధానికి గురైన పలు యాప్ ల యాజమాన్యాలు ఇచ్చిన తాజా సమాధానంతో.. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది.

గతేడాది జూన్ లో మొత్తం 267 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. మిలియన్ల యూజర్లు, ఆర్టిస్టులు, స్టోరీ-టెల్లర్స్, ఎడ్యుకేటర్స్, పర్ఫార్మర్స్ ఉన్న ఇండియాలో టిక్ టాక్ ను తిరిగి రీలాంచ్ అయ్యే రోజుల కోసం తాము ఎదురుచూస్తున్నట్టు ఉద్యోగులకు పంపిన మెయిల్ లో సంస్థ పేర్కొంది. అయితే తాజాగా కేంద్రం నిషేధం ఎత్తివేయకపోవడంతో బైట్‌డాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి భారత్, చైనా మధ్య ఘర్షణ వాతావరణమే యాప్‌ల నిషేధానికి కారణం. లడఖ్ లోని సరిహద్దుల వద్ద చైనాతో ఘర్షణలో.. కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని.. మన దేశ ప్రజల డేటా తీసుకుంటున్న చైనా కంపెనీలపై వేటు వేసింది.



Tags

Read MoreRead Less
Next Story