యూజర్లను కంగారు పెట్టిన యూట్యూబ్‌.. కొద్దిగంటలపాటు సేవలకు అంతరాయం

యూజర్లను కంగారు పెట్టిన యూట్యూబ్‌.. కొద్దిగంటలపాటు సేవలకు అంతరాయం

యూట్యూబ్‌ ప్రపంచాన్ని కొద్ది గంటలు కంగారు పెట్టేసింది.. కొద్ది గంటలపాటు స్క్రీన్‌పై యూట్యూబ్‌ కనిపించకపోవడంతో యూజర్స్‌ షాక్‌కు గురయ్యారు.. యూట్యూబ్‌ పేజ్‌ ఓపెన్‌ కాకపోవడం, ఓపెన్‌ అయినా, స్క్రీన్‌ మొత్తం ఖాళీగా కనిపించడం, ఎలాంటి వీడియోలు అప్‌లోడ్‌ కాకపోవడంతో ఏం జరిగిందోనని ఆందోళన పడ్డారు. యూట్యూబ్‌ ఓపెన్‌ చేయగానే కొందరికి ఎర్రర్‌ కోడ్‌ 500, మరికొందరికి ఎర్రర్‌ కోడ్‌ 400 కనిపించడంతో కంగారుపడ్డారు. గంట తర్వాత కూడా ఇదే పరిస్థితి కనిపించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకున్నారు.. వెంటనే అప్రమత్తమైన యూట్యూబ్‌ టెక్నికల్‌ టీమ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యూట్యూబ్‌ సేవలు రెండు మూడు గంటలపాటు నిలిచిపోయాయి.. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా సహా అనేక దేశాల్లో యూట్యూబ్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ కాలేదు.. వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే లోడ్‌ కాకపోవడం, ఆ వెంటనే ఎర్రర్‌ స్క్రీన్‌ రావడంతో యూట్యూబ్‌ సర్వర్‌ క్రాష్‌ అయిందనుకున్నారు. అటు యూట్యూబ్‌ ఆగిపోవడంతో టెక్నికల్‌ టీమ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. యూట్యూబ్‌ సర్వర్‌ క్రాష్‌ అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది..

యూట్యూబ్ అంటే బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్‌.. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, వార్తలు, లైవ్‌ స్ట్రీమింగ్‌.. ఇలా యూట్యూబ్‌ ఓపెన్‌ చేయగానే ఎన్నో కనిపించేయి.. బోలెడంత కంటెంట్‌ జనాన్ని ఎంటర్‌టైన్‌ చేసేది.. అలాంటి యూట్యూబ్‌ ఓపెన్‌ కాకపోవడంతో యూజర్లు తెగ టెన్షన్‌ పడిపోయారు. యూట్యూబ్‌ ఆధారిత ఇతర సేవలపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే, యూజర్లు కంగారు పడకుండా యూట్యూబ్‌ టెక్నికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా అప్‌డేట్‌ ఇస్తూ వచ్చింది.. సమస్యను పరిష్కరించేందుకు తమ టీమ్‌ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందంటూ వివరించింది. ఎప్పటికప్పుడు వివరాలు అప్‌డేట్ చేస్తామని తెలిపింది. అయితే, రెండు మూడు గంటల తర్వాత యూట్యూబ్ మళ్లీ యథావిధిగా పనిచేయడం మొదలవడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story