అమెరికాలో షాక్... 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు

అమెరికాలో షాక్... 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు

ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో ఈ దారుణం వెలుగుచూసింది. జాలిస్కో రాష్ట్రంలోని గాడలాజారాకు దగ్గర్లోని ఒక లోయలో 45 బ్యాగుల్లో మానవ శరీరభాగాలు బయటపడ్డాయి. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాలని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మే 20న దాదాపు 30 ఏళ్ల వయసు ఉన్న ఏడుగురు యువతీయువకులు కనిపించకుండా పోయారు. వారి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారంతా ఒకే కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. వారు పనిచేస్తోన్న కాల్‌ సెంటర్‌కు సమీపంలోనే ఈ బ్యాగులు దొరికాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ కాల్‌ సెంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మాదకద్రవ్యాలు, రక్తపు మరకలతో ఉన్న వస్తువులు, కొన్ని దస్త్రాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఆ శరీరభాగాలు ఎవరివనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

జాలిస్కో రాష్ట్రంలో ఇలా బ్యాగుల్లో మానవశరీర భాగాలను గుర్తించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో టోనాలా ప్రాంతంలో 70 బ్యాగుల్లో అవశేషాలు బయటపడ్డాయి. అవి 11 మంది వ్యక్తులవని అప్పుడు వెల్లడైంది. 2019లో 29 వ్యక్తులకు చెందిన 119 బ్యాగులను గుర్తించారు. ఇక 2018లో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కేసు దేశంలో తీవ్ర నిరసనకు దారితీసింది. వారి శరీర అవశేషాలను యాసిడ్‌ పోసి కరిగించడమే అందుకు కారణం. ఇలా అక్కడ వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితికి అక్కడి డ్రగ్స్ మాఫియానే కారణంగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story