Indonesia: బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Indonesia: బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి
మరో 12 మంది ఆచూకీ గల్లంతు

సుమత్రా దీవిలో ఉన్న మౌంట్ మరాపిని అధిరోహించేందుకు వెళ్లి 11 మంది పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. ఆ పర్వతంపై ఉన్న క్రీయాశీలక అగ్నిపర్వతం బద్దలవ్వడంతో పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. మెుత్తం 75 మంది శనివారం మౌంట్ మరాపిని అధిరోహించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 49 మందిని సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు తెలిపారు. వారికి కాలిన గాయాలు కాగా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారాంతం కావడంతో పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందిందని తెలిపారు. మౌంట్ మరాపి సమీపంలోని ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఇండోనేసియాలో మెుత్తం 127 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి.

అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. సమీప ప్రాంతాల్లోని రహదారులు, కార్లపై బూడిద పేరుకుపోయింది. బూడిద నుంచి రక్షణగా అధికారులు ప్రజలకు మాస్కులు, అద్దాలు అందించారు. మౌంట్ మరాపి సమీప గ్రామాల్లో దాదాపు 1500 మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇండోనేసియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ ప్రాంతంలో ఉండటంతో తరచూ అక్కడ అగ్ని పర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సంభవిస్తుంటాయి

Tags

Read MoreRead Less
Next Story