Moscow Terror Attack : కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు

Moscow Terror Attack :  కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు
మే 22 వరకూ కస్టడీ

మాస్కోలో ఉగ్రదాడి చేసిన ముష్కరులు.. తమ నేరాన్ని కోర్టులో అంగీకరించారు. ఫలితంగా వారిని మే 22వరకు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దాడి వివరాలు కక్కించే ప్రయత్నంలో భాగంగా రష్యా భద్రతాబలగాలు ఉగ్రవాదులను తీవ్రంగా హించినట్లు తెలుస్తోంది. కోర్టు హాలులో 19 ఏళ్ల నిందితుడు అయితే.. ఏ మాత్రం చలనం లేకుండా ఉండిపోయాడు.

మాస్కోలో జరిగిన ఉగ్రదాడిలో.. ప్రత్యేక బలగాలకు చిక్కిన నలుగురిలో ముగ్గురు ముష్కరులు బాస్మన్నీ జిల్లా కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు. మిర్జోవ్; షంసిదిన్ ఫరీదున్, రాషబలిజోడా, ఫైజోవ్ అనే నలుగురు ముష్కరులు క్రాకస్‌సిటీ హాల్‌లో ఉన్న పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. దాడి తర్వాత పారిపోతుండగా బ్రియాన్స్క్‌ ప్రాంతంలో వారిని అరెస్టు చేసి విచారించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. అనంతరం వారిని కళ్లకు గంతలు కట్టి కోర్టులో హాజరు పరచగా.. అందులో ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. మరో వ్యక్తి మాత్రం.. వీల్‌ఛైర్‌కే పరిమితమై ఏమాత్రం మాట్లాడలేని అచేతనస్థితిలో ఉండిపోయాడు. వీరందరిని ఓ గ్లాస్‌ రూంలో ఉంచి మీడియా ముందు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం తజకిస్థాన్‌కు చెందిన ఈ నలుగురినీ మే 22 వరకు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. రష్యా చట్టాల ప్రకారం వీరందరికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

కోర్టులోహాజరుపరచిన ఉగ్రవాదులను చూస్తే ఎంత తీవ్రంగా కొట్టారో అర్థమవుతోంది.విచారణ సందర్భంగా వారిని భద్రతా బలగాలు తీవ్రంగా కొడుతున్న వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో లీక్‌ అయ్యాయి. ఇంటరాగేషన్‌ సమయంలో వారికి కరెంట్‌షాక్‌ కూడా ఇచ్చినట్లు సమాచారం. మిర్జోవ్‌, రాషబలిజోడాల కళ్ల వద్ద కమిలిపోయాయి.రాషబలిజోడా చెవిని కత్తిరించి బ్యాండెయిడ్‌ వేసినట్లు తెలిసింది. ఫరిదుని అనే వ్యక్తి ముఖం అంతా వాచిపోయింది. 19 ఏళ్ల ఫైజోవ్‌ అనేనిందితుడు వీల్‌ఛైర్‌కే పరిమితమై విచారణ సమయంలో స్పృహలోనే లేడని తెలిసింది. అతడి కన్ను పోయినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం మాస్కోలోని క్రాకస్‌సిటీ హాల్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. నలుగురు ఉగ్రవాదులు ప్రేక్షకులపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 137 మంది పౌరులు చనిపోగా.. 180మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. వివరాలు తెలియని మృతదేహాలకు డీఎన్‌యే పరీక్షలు నిర్వహించి.. కుటుంబాలకు అందిస్తున్నారు. ఘటనకు ఐసిస్‌ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. అఫ్గానిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే ఇస్లామిక్‌ స్టేట్-ఖొరాసన్‌ ఉగ్రముఠా.. టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా నిందితులను సమన్వయం చేస్తూ పథకాన్ని అమలు చేసినట్లు సమాచారం. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేసినట్లు నిందితులు చెబుతున్నారు. 5 వేల 425 డాలర్లు ఇస్తామని చెప్పి అందులో సగాన్ని బ్యాంకుకు ముందే ట్రాన్స్‌ఫర్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరో 11 మంది అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story