ఉగాండాలో దారుణం..తిరుగుబాటుదారుల దాడిలో 38 మంది విద్యార్థులు మృతి

ఉగాండాలో దారుణం..తిరుగుబాటుదారుల దాడిలో  38 మంది విద్యార్థులు మృతి
ఉగాండాలో దారుణం చోటుచేసుకుంది. కాంగోసరిహద్దు సమీపంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 38 మంది విద్యార్థులు సహా 41 మంది మృతి చెందారు

ఉగాండాలో దారుణం చోటుచేసుకుంది. కాంగోసరిహద్దు సమీపంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 38 మంది విద్యార్థులు సహా 41 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలయిడ్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌కు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 20 నుంచి 25 మంది తిరుగుబాటుదారులు ఇక్కడి లుబిరిరా సెకండరీ పాఠశాలపై దాడులు జరిపారని చెప్పారు.

అనంతరం వసతిగృహానికి నిప్పుపెట్టారని... ఇప్పటివరకు 41 మృతదేహాలను వెలికితీశామన్నారు. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉందని... ఇక్కడి ఆహారశాలనూ వారు దోచుకున్నారని తెలిపారు.దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించామని, వారిని వెంటాడుతున్నామని పోలీసులు చెప్పారు. పరారయ్యే ముందు పలువురిని అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది.

ఇక 1986 నుంచి అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఏడీఎఫ్‌ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం ఎదురుదాడులతో తూర్పు కాంగోలోకి పారిపోయి.. అక్కడినుంచి హింసకు తెగబడుతోంది. ఏడీఎఫ్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏడీఎఫ్‌ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story