China: సొంత ఉచ్చులో అణు జలాంతర్గామి, 55 మంది మృతి

China: సొంత ఉచ్చులో  అణు జలాంతర్గామి, 55 మంది మృతి
శత్రువుల కోసం వల పన్ని సొంత నావికులను కోల్పోయిన చైనా

పసుపు సముద్ర జలాల్లో చైనా భారీ అణు ప్రమాదం చోటుచేసుకొంది. చైనాకి చెందిన ఓ సబ్‌మరైన్ నడి సముద్రంలో చిక్కుకోవడంతో 55 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. కానీ ఈ విషయాన్ని చైనా ప్రపంచం నుంచి దాచిపెట్టింది. సంఘటన జరిగి ఇప్పటికీ నెల కావస్తున్నా ఈ విషయంపై నోరు మెదపలేదు. . శత్రు నౌకలను, సబ్ మెరైన్ లను అడ్డుకోవడానికి చైనా అమర్చిన ట్రాప్ తన సొంత నావికులనే బలి తీసుకుందన్న విషయాన్ని యునైటెడ్ నేషన్స్ ఇంటెలిజెన్స్ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టులో యెల్లో సీలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పింది. అయితే, ఈ వార్తలను చైనా కొట్టిపారేసింది. అలాంటి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.


యూకే వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆగస్టు 21న స్థానిక కాలమానం ప్రకారం, ఉదయం 8:12 గంటలకు చైనాకు చెందిన అణుశక్తి సబ్ మెరైన్ 093-417 ట్రాప్ లో చిక్కుకుంది. దీని ప్రభావంతో సబ్ మెరైన్ సిస్టం ఫెయిలైంది. దాదాపు 350 అడుగుల పొడవుండే ఈ అత్యాధునిక సబ్‌మెరైన్‌‌లో బ్యాటరీల శక్తి సన్నగిల్లి.. ఎయిర్‌ ప్యూరిఫైయర్‌, ఎయిర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలు నిలిచిపోయి ఉండొచ్చని బ్రిటన్‌ నిపుణులు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థకు మారే ప్రయత్నం చేసినా అది కూడా విఫలమైంది. దీంతో గాలి కలుషితమై హైపాక్సియాకు దారితీసిందని, మరమ్మతు చేయడానికి దాదాపు ఆరు గంటల సమయం పట్టిందని యూకే నివేదికలు పేర్కొన్నాయి. వ్యవస్థను పునరుద్దరించేలోపు 22 మంది ఆఫీసర్లు, ఏడుగురు ఆఫీసర్ కాడెట్లు, 9 మంది పెట్టీ ఆఫీసర్లు, 17 మంది సెయిలర్లు అందరూ విగతజీవులుగా మారిపోయారని తెలిపింది.


క్వింగ్‌డావ్‌ నౌకాదళ స్థావరానికి సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ స్థావరంలోకి ప్రత్యర్థుల జలాంతర్గాముల చొరబడకుండా ‘చైన్‌, యాంకర్‌ ఉచ్చు’ను డ్రాగన్ ఏర్పాటుచేసింది. ఆ ఉచ్చులో సొంత సబ్‌మెరైనే చిక్కినట్లు డైలీ మెయిల్‌ కథనం పేర్కొంది. చైనా నౌకాదళం ఇలాంటి ఉచ్చులను వినియోగిస్తూ ఉంటుంది. ఈ ప్రమాదంపై స్పందించేందుకు బ్రిటిష్ రాయల్‌ నేవీ నిరాకరించింది.

ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్‌ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్‌, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయని తాజాగా బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్‌’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో అణు లీకులు ఏమైనా జరిగాయా అనే సందేహం ప్రపంచ దేశాల్లో మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story