NEPAL CRASH: కుప్పకూలిన హెలికాఫ్టర్‌... ఆరుగురి మృతి

NEPAL CRASH: కుప్పకూలిన హెలికాఫ్టర్‌... ఆరుగురి  మృతి
నేపాల్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌... అయిదుగురు మెక్సికన్లు సహా ఆరుగురి మృతి.. శరీర భాగాలు స్వాధీనం చేసుకున్న అధికారులు

నేపాల్‌లో మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో ప్రైవేటు హెలికాప్టర్‌ గల్లంతైన ఘటన విషాదంగా ముగిసింది. ఈ హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాఫ్టర్‌లో ఉన్న పైలెట్ సహా ఐదుగురు మెక్సికన్ దేశస్థులు ప్రమాదంలో కన్నుమూశారని వెల్లడించారు. వారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. హెలికాఫ్టర్‌ను నడుపుతున్న వ్యక్తిని సీనియర్‌ పైలట్‌ చెట్‌ గురుంగ్‌గా గుర్తించారు. అతను మనంగ్ ఎయిర్‌లో దశాబ్దం నుంచి విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1998 నుంచి గురుంగ్‌ విమానాలను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఎవరెస్ట్ సహా ఎత్తైన పర్వత శిఖరాలకు నిలయమైన సోలుకుంభు జిల్లాలోని సుర్కు విమానాశ్రయం నుంచి కాఠ్ మాండూకు ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వివరించారు. 9ఎన్‌-ఏఎంవీ కాల్‌ సైన్‌తో వ్యవహరించే ఈ హెలికాప్టర్‌ సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఉదయం 10.15గంటలకు హెలికాప్టర్ 12వేల అడుగుల ఎత్తులో ఉండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. లమ్జురాపాస్ వద్దకు చేరుకున్నాక వైబర్ పై హల్లో సందేశం మాత్రమే రావటంతో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ జాడ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.


ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాఫ్టర్‌ ప్రయాణ మార్గాన్ని మార్చుకోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం చోటు చేసుకొన్న ప్రదేశం ఎవరెస్ట్‌ శిఖరానికి సమీపంలో ఉంటుందని నేపాల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారి జ్ఞానేంద్ర భుల్‌ నేపాల్‌ వెల్లడించారు. హెలికాప్టర్లో అమర్చిన జీపీఎస్‌ సంకేతాలు లమ్జురాపాస్‌ వద్ద నిలిచిపోయినట్లు ఆయన చెప్పారు.

లిఖుపికే రూరల్‌ మున్సిపాలిటీ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు హెలికాప్టర్‌ కుప్పకూలినట్లు గుర్తించారు. పైలట్‌ చెట్‌ గురుంగ్‌తో పాటు మరో ఐదుగురు మెక్సికన్‌ల మృతదేహాలనూ కనుగొన్నారు. చెల్లాచెదురుగా పడి ఉన్న వారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌తో సహా దేశంలోని ఎత్తైన శిఖరాలను చూడాలనుకునే పర్యాటకుల కోసం మనంగ్ ఎయిర్... హెలికాప్టర్‌ను నడుపుతోంది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని.... ఈ ఘోరంపై విచారణకు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేయనుందని ఏవియేషన్‌ అధికారి జ్ఞానేంద్ర భుల్‌ నేపాల్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో రాజధాని కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 72 మంది మరణించిన విషయం తెలిసిందే.NEPAL CRASH: కుప్పకూలిన హెలికాఫ్టర్‌... ఆరుగురి మృతి

Tags

Read MoreRead Less
Next Story