Adani : జార్జ్ సోరోస్‌ పై కేంద్రం ఫైర్

Adani : జార్జ్ సోరోస్‌ పై కేంద్రం ఫైర్
హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కష్టాల్లో పడటంతో మోదీ బలహీన పడే అవకాశముందని వ్యాఖ్యానించారు

దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించిన అదానీ గ్రూప్‌ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడంలేదు. హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో మోదీ సర్కార్‌పై విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ జార్జ్ సోరోస్‌ భారత ప్రధాని నరేంద్రమోదీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో జార్జ్‌ సోరోస్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించిన ఆయన.. మోదీ, అదానీకి దగ్గరి సంబంధాలున్నాయన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కష్టాల్లో పడటంతో మోదీ బలహీన పడే అవకాశముందని వ్యాఖ్యానించారు. అదానీ వ్యవహారం.. భారత్‌ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ప్రేరేపిస్తోందని, దీనిపై ప్రధాని మౌనంగా ఉంటున్నారని విమర్శించారు.

అయితే సోరోస్‌ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు కుట్రలు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. జార్జ్‌ సోరోస్‌ కేవలం ప్రధాని మోదీపైనే కాదు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేస్తున్నారు.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ను దోచుకున్న ఆయనను ఆ దేశం ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే తన కోరికను బయటపెట్టారు. ఇలాంటి వారు ఇతర దేశాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తమకు నచ్చిన వ్యక్తులను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారని మండిపడ్డారు. గతంలో దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోగా.. వారిని మట్టికరిపించామని తెలిపారు. జార్జ్‌ సోరోస్‌ కు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఏకమవ్వాలని ట్వీట్ చేశారు.

మరోవైపు జార్జ్‌ సోరోస్‌ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్‌ కూడా తీవ్రంగా స్పందించింది. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలు, మా ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సోరోస్‌ లాంటి వ్యక్తులు మన ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేరని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story