Afghanistan: ఐదు రోజులే మిగిలింది.. ఆ తర్వాత ఏం జరగబోతుంది..?

Afghanistan: ఐదు రోజులే మిగిలింది.. ఆ తర్వాత ఏం జరగబోతుంది..?
Afghanistan Crisis: కౌంట్‌డౌన్‌ మొదలైంది డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది..

Afghanistan News: కౌంట్‌డౌన్‌ మొదలైంది డెడ్‌లైన్‌ ముంచుకొస్తోంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది.. ఏం చేసినా ఆలోపే.. ఇప్పటికే పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. తాలిబన్ల పాలనకు భయపడి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు బాంబు దాడులు జరుగుతాయన్న హెచ్చరికలతో హడలెత్తిపోతున్నారు. అమెరికా దళాలు ఐదు రోజుల్లోగా అఫ్గాన్‌ను దాటి వెళ్లకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు.. అసలు అఫ్గానిస్థాన్‌లో ఏం జరుగుతోంది..?

ఆగస్టు 31 ఇప్పుడు అందరి దృష్టి ఈ తేదీ మీదే ఉంది. ఆ రోజు నాటికి అమెరికా సంకీర్ణ దళాలు ఆఫ్గానిస్తాన్ నుంచి పూర్తిగా వెనుతిరిగితే అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఉన్నదానికంటే ఘోరంగా, భయంకరంగా మారబోతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేశారనే సమాచారంతో.. అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ తమ పౌరులకు తాజాగా హెచ్చరికలు చేశాయి. వీలైనంత త్వరగా కాబుల్ నుంచి బయటపడాలని లేదంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాయి.

ఆగస్టు 31 తేదీనే డెడ్​లైన్ అని అదే వారికి రెడ్​లైన్ అని తాలిబన్లు మరోసారి హెచ్చరించారు. రెడ్​లైన్ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు డెడ్​లైన్ పొడిగించాలని అమెరికాపై మిత్ర దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. అటు.. తాలిబన్ల డెడ్‌లైన్‌ దృష్టిలో పెట్టుకుని పౌరుల తరలింపు ప్రక్రియను ఆయా దేశాలు ముమ్మరం చేశాయి. ఆగమేఘాల మీద ప్రజలను దేశం దాటిస్తున్నాయి. అమెరికా ఇప్పటి వరకు 82 వేల మందిని సురక్షితంగా ఆ దేశం నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇందులో 19 వేల మందిని ఒక్కరోజే తీసుకురావడాన్ని గమనిస్తే.. తరలింపు ప్రక్రియను అమెరికా ఎంత వేగవంతం చేసిందనే విషయం స్పష్టమవుతోంది.

ఆగస్టు 15న తాలిబన్ల ఆక్రమణ మొదలైన నాటి నుంచి నేటి వరకూ కాబుల్ విమానాశ్రయం నుంచి దాదాపు లక్ష మందికి పైగా ఆఫ్గాన్లు, విదేశీయులు వలస వెళ్లిపోయారు. శరణార్థులుగా దేశ సరిహద్దులు దాటి పొరుగున తలదాచుకున్న వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో 4 వేల మంది అమెరికా సైనికులు పహారా కాస్తున్నారు. సరైన పత్రాలతో ఉన్న వారిని ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతిస్తూ వారు ఇతర దేశాలకు వెళ్లేందుకు సాయం చేస్తున్నారు. ఐతే కాబుల్‌లో ఉగ్రదాడులు జరగొచ్చనే హెచ్చరికలతో ఫ్రాన్స్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి.

కాబుల్‌ ఎయిర్‌పోర్టు బయట ప్రస్తుత దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. 3 గేట్ల వద్ద వేలాది మంది పడిగాపులు పడుతున్నారు. తాము దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు. అటు.. ఈ ప్రాంతంలో ఇప్పుడు వాటర్ బాటిల్ కొనాలన్నా 29 పౌండ్లు అంటే 3 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అదే ప్లేట్‌ భోజనం అయితే 7 వేలకుపైనే. పైగా ఆఫ్గాన్ కరెన్సీని ఎవరూ తీసుకోవడం లేదు. డాలర్లు, పౌండ్లలో చెల్లిస్తేనే అవి దొరుకుతున్నాయి.

రోజురోజుకూ విమాన సర్వీసులు తక్కువైపోతున్నాయి. ఎయిర్‌పోర్టు దగ్గర చూస్తే వేలాది మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితులు అత్యంత ఘోరంగా కనిపిస్తున్నాయి. విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న మురుగుకాల్వలో సైతం దిగి ఏదో రకంగా లోపలికి వెళ్లేందుకు అక్కడి వాళ్లు ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

అటు ఆఫ్గాన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదంటూ హుకూం జారీ చేసిన తాలిబన్లు.. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారుల్ని మూసేశారు. విదేశీయులకు మాత్రమే బయటకు వెళ్లే అవకాశం ఇస్తున్నారు. ఆఫ్గాన్‌కు చెందిన డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు వలసపోవడానికి వీల్లేదంటూ తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ హెచ్చరికలు చేస్తుండడంతో వేల మంది ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story