అంతర్జాతీయం

తాలిబన్లు కిరాతకం..అమ్మాయిలను శవపేటికల్లో పెట్టి ..

Afghanistan: తాలిబన్ ఫైటర్లకు వంట సరిగా చేయలేదనే కారణంతో ఓ మహిళను సజీవదహనం చేశారు.

తాలిబన్లు కిరాతకం..అమ్మాయిలను శవపేటికల్లో పెట్టి ..
X

Afghanistan: మేం మంచోళ్లం అని చెప్పి నాలుగు రోజులు కాలేదు.. అప్పుడే విధ్వంసం సృష్టిస్తున్నారు తాలిబన్లు. తమకు వ్యతిరేకంగా నోరు తెరిస్తే చాలు నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తున్నారు. 9 మందిని అత్యంత దారుణంగా చంపేశారు తాలిబన్ కిరాతకులు. మహిళలపైనా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాలిబన్ ఫైటర్లకు వంట సరిగా చేయలేదనే కారణంతో ఓ మహిళను సజీవదహనం చేశారు. అసలే తిండి దొరక్క అల్లాడుతుంటే.. తమకు ఎలాగైనా సరే తిండి పెట్టాలని స్థానికులను వేధిస్తూ, హింసిస్తున్నారు తాలిబన్లు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు ఎత్తుకెళ్లిపోతున్నారు. అమ్మాయిలను శవపేటికల్లో పెట్టి పొరుగు దేశాలకు తరలిస్తున్నారు. వారిని సెక్స్ బానిసలుగా వాడుకునేందుకే ఇలా తరలిస్తున్నారని ఆఫ్గాన్‌లోని జర్నలిస్టులు చెబుతున్నారు. ఆడపిల్లల కుటుంబాలను దారుణంగా వేధిస్తున్నారు తాలిబన్లు. కూతుళ్లను తమకిచ్చి పెళ్లి చేయకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. రాక్షసులు మారరు, వారిలోని రాక్షసత్వమూ మారదని మరోసారి నిరూపించుకుంటున్నారు.

విదేశీ సైన్యానికి సహకరించిన వారిని ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు తాలిబన్లు. ఆఫ్గాన్‌లోని చాలా ప్రావిన్స్‌లలో ఇంటర్నెట్‌ లేకపోవడంతో తాలిబన్ల అరాచకాలు బయటకు రాలేదు. కాని, ఆమ్నెస్టీ సంస్థ మాత్రం ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలను బట్టబయలు చేసింది. ఒక్కో ప్రావిన్సును చేజిక్కించుకుంటున్న సమయంలోనే వందల మందిని చంపుకుంటూ వచ్చారని తెలిపింది. నాటో దళాలకు సహకరించిన తజక్‌లు, ఉజ్బెక్‌లు, హజారాలను అత్యంత కిరాతకంగా చంపేశారని ఆమ్నెస్టీ చెప్పుకొచ్చింది. జర్మనీ పత్రికకు ఆఫ్గాన్‌ ప్రతినిధిగా ఉన్న ఓ జర్నలిస్టు దొరక్కపోవడంతో.. ఆ జర్నలిస్టు కుటుంబ సభ్యుడిని కాల్చి చంపారు. మహిళలను గౌరవమిస్తామని తాలిబన్లు చెప్పిన మాటలు అబద్ధాలని తేలిపోయాయి. ఆడవాళ్లెవరూ ఉద్యోగాలు చేయకూడదంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ప్రాణాలకు తెగించి తాలిబన్లను ఎదురిస్తున్నారు కొందరు ఆఫ్గాన్లు. ఆయుధాలు పట్టి తాలిబన్లను వేటాడుతున్నారు. యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేతృత్వంలో స్థానిక ప్రజలు తిరుగుబాటు చేశారు. బాగ్లన్ ప్రావిన్స్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి విడిపించుకోగలిగారు. ఆ మూడు జిల్లాల నుంచి తాలిబన్లను తరిమికొట్టి తాలిబన్ జెండా స్థానంలో ఆఫ్గానిస్తాన్ జాతీయ జెండా ఎగరవేశారు. ఆఫ్గాన్లు జరిపిన కాల్పుల్లో తాలిబన్ ఫైటర్లు చనిపోయారు. క్రమంగా ఇతర జిల్లాలను కూడా ఆక్రమించుకుంటూ వెళ్తామని, తాలిబన్లను తరిమికొడతామని చెబుతున్నారు.

తాలిబన్లపై తిరగబడుతున్న ఆఫ్గాన్లకు అమ్రుల్లా మద్దతు కూడా దొరికింది. తనకు తాను ఆఫ్గాన్‌ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా.. తాలిబన్ల ఆట కట్టించేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. పంజ్‌షేర్ కేంద్రంగా తాలిబన్లను అణచివేసే ప్లాన్‌పై సమాలోచనలు జరుపుతున్నారు. నార్తర్న్ కూటమి పేరిట తాలిబన్లపై సాయుధ పోరాటానికి అమ్రుల్లా ప్రణాళికలు రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

ఇప్పటివరకైతే తాలిబన్ల పాలన అధికారికంగా మొదలవ్వలేదు. అమెరికాతో జరిగిన ఒప్పందం ప్రకారం.. ఇంకా ఆ దిశలో చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ నెల 31లోగా తమ సేనలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రకటించింది. ఆ తర్వాతే ఆఫ్గాన్‌లో పాలన ప్రారంభమవుతుందని తాలిబన్లు చెబుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తాలిబన్ల పాలన మొదలయ్యాక పరిస్థితులు ఇంకెంత దిగజారుతాయోనని ఆఫ్గాన్లు భయపడిపోతున్నారు.

Next Story

RELATED STORIES