అగ్ర రాజ్యానికి ఆర్థిక సంక్షోభం..!

అగ్ర రాజ్యానికి ఆర్థిక సంక్షోభం..!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా ఇపుడు సంక్షోభంలో పడిందా? అగ్రరాజ్యాన్ని ఆర్ధిక మాంద్యం ముంచెత్తనుందా?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అమెరికా ఇపుడు సంక్షోభంలో పడిందా? అగ్రరాజ్యాన్ని ఆర్ధిక మాంద్యం ముంచెత్తనుందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా రుణ పరిమితి పెంపుపై అధికార డెమోక్రటిక్‌, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీల మధ్య అంగీకారం కుదరలేదు. దీంతో జీతభత్యాలు, పింఛన్లు నిలిచిపోయే పరిస్థితి ఉందని అక్కడి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే వచ్చే నెలలోపు అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

రాత్రి వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జోబైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్ధీల మధ్య చర్చ జరిగింది. అమెరికా రుణ పరిమితిని పెంచడంపై ఇరువురు సుధీర్ఘంగా చర్చించారు. అయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. మరో 10 రోజుల్లో అంటే జూన్‌ 1 లోపు రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల నిలిచిపోనున్నాయి. అలాగే విదేశాలు కొనుగోలు చేసిన బాండ్లకు సైతం చెల్లింపులు ఆగిపోనుంది. అదే జరిగితే అమెరికానే కాక యావత్‌ ప్రపంచాన్నీ ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని కాంగ్రెస్‌కు రాసిన లేఖలో ఆర్థిక మంత్రి జెనెట్‌ యెలెన్‌ హెచ్చరించారు.

అమెరికాలోని దిగువ సభలో బైడెన్‌కు సంఖ్య తగ్గింది. ట్రంపు వర్గానికి ఎక్కువ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలోని సభ్యులు ఒప్పుకుంటేనే అమెరికా ప్రభుత్వానికి ఎక్కువ అప్పు వస్తుంది. సత్వరమే రిపబ్లికన్లు అంగీకరించాలని డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కోరుతున్నారు. లేకుంటే అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుందని అంటున్నారు. దీనికి ట్రంప్ వర్గం వ్యతిరేకిస్తోంది. వార్షిక బడ్జెట్ కేటాయింపులకు ఆరేళ్ల పాటు ఏటా ఒక శాతం చొప్పున కోత పెట్టి డబ్బు ఆదా చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తే రక్షణ, రక్షణేతర వ్యయాలను 9 వేల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని చెప్తున్నారు. అలాగే పదేళ్లలో లక్ష కోట్ల డాలర్లు మిగులాయని డెమోక్రాట్లు తెలిపారు.

అధ్యక్షుడు బైడెన్ మాత్రం 2024 బడ్జెట్‌ను 2023 స్థాయిలోనే కొనసాగిస్తామని తేల్చిచెప్తున్నారు. అత్యంత సంపన్నులపైనా, కొన్ని బడా కంపెనీలపైనా పన్నులు పెంచి బడ్జెట్‌ లోటును కొంతవరకు భర్తీ చేసుకోవచ్చని ప్రతిపాదించారు. అయితే అందుకు స్పీకర్ కెవిన్ మెకార్థీ ససేమిరా అన్నారు. వారానికి కనీసం 20 గంటలు పనిచేస్తున్న వారికే మెడికెయిడ్‌ కింద ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. కరోనా, ఆర్థిక మాంద్యం వల్ల అల్పాదాయ వర్గాలు ఉపాధి కోల్పోయాయని గుర్తుచేశారు. అటు బైడెన్‌ సర్కారు వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్లాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు. మరి అమెరికాను ఆర్థిక సంక్షోభం భయపెడుతున్న వేళ ఏంజరుగుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story