Australia: విద్యార్థి వీసాలకు కఠిన నిబంధనలు

Australia:  విద్యార్థి వీసాలకు కఠిన నిబంధనలు
వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు

ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్‌ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్‌ సోమవారం నాడు చెప్పారు.

దేశంలోకి వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై విద్యార్థులు, తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది.

మారిన నిబంధనల ప్రకారం... ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో అత్యధిక రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉండేందుకు ఉపకరించే రెండో వీసా దరఖాస్తును ఇకపై మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా, సంబంధిత పత్రాల్లో ఏ కొంచెం తేడా ఉన్నా వీసా నిరాకరించే అవకాశం ఉంటుంది.

దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమ నూతన వలస విధానాన్ని ఐదు అంశాల ఆధారంగా రూపొందించామని వెల్లడించింది. ఆస్ట్రేలియన్ల జీవన ప్రమాణాలను పెంపొందించడం, సుహృద్భావ పని వాతావరణం కల్పించడం, అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడం వీటిలో ముఖ్యమైనవని తెలిపింది.

ఇప్పటికే ఓ మోస్తరు నైపుణ్యాలతో ఆస్ట్రేలియాలో నెట్టుకొస్తున్న విదేశీయులకు కూడా ఈ వీసా నిబంధనలు ఇబ్బందిగా మారనున్నాయి. కొత్త వీసాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే తక్కువ నైపుణ్యాలు కలిగినవారి తాత్కాలిక వీసాలు సమీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

2022-23లో దేశంలో రికార్డు స్థాయిలో 5 లక్షల పది వేల మంది వరకు వచ్చారు. దీనితో పెరిగిపోతున్న వలసలకు బ్రేక్‌ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అధికారిక గణాంకాల ప్రకారం వీసాలను 2024-25, 2025-26 నాటికి 2.5 లక్షలకు తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వలసల సంఖ్యను కోవిడ్‌ కంటే ముందున్న స్థాయికి తేవాలనేది ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోంది.సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ సర్వేలో 62 శాతం మంది దేశంలో వలసలు పెరిగిపోవడం వల్లే ఇళ్ల కొరత ఏర్పడిందని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం వలసలపై కొరడా ఝళిపించాలని నిర్ణయించింది.

Tags

Read MoreRead Less
Next Story